ట్రంప్ కు మరో షాక్.. భారత్‌కు రానున్న యూకే ప్రధాని స్టార్మర్

  • అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
  • ముంబైలో జరగనున్న ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొనే అవకాశం
  • ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యం
భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. ఇదే సమయంలో భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పలు విధాల యత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ తగలబోతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ నెలలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ముంబైలో జరిగే ప్రతిష్టాత్మక ఫిన్‌టెక్ సదస్సులో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), ఫిన్‌టెక్ రంగంలో సహకారంపై కీలక చర్చలు జరిగాయి. ఆ చర్చలకు కొనసాగింపుగా, ఒప్పందాలను మరింత పటిష్ఠం చేసేందుకే స్టార్మర్ భారత్‌కు రానున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పర్యటన వేసవిలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో అక్టోబర్ చివరి నాటికి పర్యటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రధాని మోదీ, స్టార్మర్ పలుమార్లు సమావేశమయ్యారు. గత జూలైలో మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3తో కూడా భేటీ అయ్యారు. ఆ సమయంలో మోదీ గౌరవార్థం కింగ్ చార్లెస్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాధినేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్మర్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.


More Telugu News