తన భుజంపై పుట్టుమచ్చ ఉన్న విషయం ఏఐకి ఎలా తెలిసింది?.. షాక్ అయిన యువతి

  • పంజాబీ డ్రెస్ తో ఉన్న ఫొటోను అప్ లోడ్ చేసిన యువతి
  • చీరతో ఆమె ఎలా ఉంటుందో చూపించిన జెమినీ ఏఐ
  • ఏఐ జెనరేట్ చేసిన ఫొటోలో భుజంపై పుట్టుమచ్చ చూసి షాకయ్యానని వెల్లడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఇన్ స్టాగ్రామ్’ లో ప్రస్తుతం శారీ ట్రెండ్ కొనసాగుతోంది. యువతులు తమ ఫొటోలను అప్ లోడ్ చేస్తే వారిని చీర కట్టుకున్నట్లు గూగుల్ జెమినీ ఏఐ మార్చేస్తోంది. ఈ ఫొటోలను చూసి మహిళలు మురిసిపోతున్నారు. అయితే, ఈ ట్రెండ్ కొంతమందికి షాకిస్తోంది. శారీ ట్రెండ్ ను ఫాలో అయిన తనకు షాకింగ్ అనుభవం ఎదురైందంటూ జలక్ భావ్ నానీ అనే యువతి పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ రీల్ పోస్ట్ చేసింది.

భావ్ నానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాను పంజాబీ డ్రెస్ లో ఉన్న ఓ ఫొటోను అప్ డేట్ చేస్తే నల్ల చీర కట్టుకున్నట్లు గూగుల్ జెమినీ ఏఐ మార్చేసిందని భావ్ నానీ తెలిపారు. చీరలో అందంగా ఉన్నానని సంతోషించేలోపే తనకు షాక్ తగిలిందని చెప్పారు. ఏఐ మార్చేసిన ఫొటోను జాగ్రత్తగా చూస్తే తన భుజంపై పుట్టుమచ్చ కనిపించిందని తెలిపారు. నిజంగానే తనకు ఆ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉందని చెప్పిన భావ్ నానీ.. ఈ విషయం ఏఐ ఎలా కనిపెట్టిందని సందేహం వ్యక్తం చేశారు.

తాను భుజాలు కవర్ అయ్యే పంజాబీ డ్రెస్, దానిపై చున్నీ వేసుకున్న ఫొటోను అప్ లోడ్ చేశానని చెప్పారు. అప్ లోడ్ చేసిన ఫొటోలో కనిపించని పుట్టుమచ్చను ఏఐ ఎలా గుర్తించిందని భావ్ నానీ ప్రశ్నిస్తున్నారు. దీనికి పలువురు నెటిజన్లు కామెంట్‌ బాక్స్ లో వివరణ ఇచ్చారు. గతంలో మీరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫొటోలను కూడా ఏఐ పరిశీలిస్తుందని, వాటి ఆధారంగా ఏఐ ఫొటోను జెనరేట్ చేస్తుందని చెప్పారు.


More Telugu News