పగలు ధైర్యం.. రాత్రయితే భయం.. హైదరాబాద్ మెట్రోపై అధ్యయనంలో వెలుగులోకి కీలక విషయాలు!

  • రాత్రి వేళల్లో హైదరాబాద్ మెట్రోలో మహిళల భద్రతపై ఆందోళన
  • ఇథేమ్స్ బిజినెస్ స్కూల్ అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి
  • సిబ్బంది కొరత, సరిగా లేని లైటింగ్ ప్రధాన సమస్యలని గుర్తింపు
  • సర్వేలో పాల్గొన్న వారిలో 11 శాతం మంది వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడి
  • మహిళల కోచ్‌లలోకి పురుషులు వస్తున్నారని ప్రయాణికుల ఫిర్యాదు
  • భద్రత పెంచేందుకు సీసీటీవీలు, మహిళా సిబ్బందిని పెంచాలని సిఫార్సు
హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైలులో రాత్రి సమయాల్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పగటిపూట సురక్షితంగానే భావిస్తున్నప్పటికీ, రాత్రి అయ్యేసరికి ప్రయాణించాలంటే భయంగా ఉందని అనేక మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, స్టేషన్లు నిర్మానుష్యంగా మారడం వంటి కారణాలతో అభద్రతాభావం నెలకొందని తాజా అధ్యయనం వెల్లడించింది.

తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇథేమ్స్ బిజినెస్ స్కూల్ ఈ సర్వే నిర్వహించింది. "హైదరాబాద్ మెట్రో ప్రయాణంలో మహిళల భద్రత" అనే అంశంపై రూపొందించిన శ్వేతపత్రాన్ని మంగళవారం విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది మహిళలు పగటిపూట మెట్రో ప్రయాణం సురక్షితమని భావిస్తుండగా, రాత్రి సమయాల్లో ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోందని తేలింది.

ఈ సర్వేలో భాగంగా మొత్తం 410 మంది మహిళా ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. మెట్రోలో తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్టేషన్లలో సరైన లైటింగ్ లేకపోవడం, అందుబాటులో టాయిలెట్లు లేకపోవడం, వీధి స్థాయిలో సరైన మౌలిక సదుపాయాల కొరత వంటివి ప్రధానంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, 11 శాతం మంది మహిళలు మెట్రో ప్రయాణంలో ఏదో ఒక రూపంలో వేధింపులకు గురైనట్లు ఈ సర్వేలో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

కొన్నిసార్లు పురుషులు మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలోకి ప్రవేశిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కవరేజ్ కూడా సరిగా లేదని మహిళలు తెలిపారు. ఈ అధ్యయనాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సహేరా ఫాతిమా నేతృత్వంలోని విద్యార్థి బృందం నిర్వహించింది. మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు మెట్రో స్టేషన్లలో మహిళా సిబ్బందిని పెంచాలని, లైటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని, సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచాలని నివేదికలో సిఫార్సు చేశారు.


More Telugu News