టీజీఎస్‌పీడీసీఎల్ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల చిట్టా.. బయటపడ్డ రూ.100 కోట్ల సామ్రాజ్యం!

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్
  • హైదరాబాద్‌లో 11 చోట్ల ఏసీబీ ఏకకాలంలో సోదాలు
  • బినామీ ఇంట్లో రూ. 2.18 కోట్ల నగదు స్వాధీనం
  • ఆస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
  • భారీ భవనాలు, ఫ్యాక్టరీ, ప్లాట్లు, బంగారం గుర్తింపు
  • ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కెమికల్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నట్టు వెల్లడి
తెలంగాణ విద్యుత్ శాఖలో ఓ అధికారి అక్రమాస్తుల చిట్టా చూసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నివ్వెరపోయారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా (ఏడీఈ) పనిచేస్తున్న ఏరుగు అంబేద్కర్‌కు సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో వెలుగుచూసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో, ఏసీబీ అధికారులు నిన్న ఆయనను అరెస్టు చేశారు.

అంబేద్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 11 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇబ్రహీంబాగ్‌లోని ఆయన కార్యాలయం, మణికొండలోని నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా అంబేద్కర్‌కు బినామీగా భావిస్తున్న సతీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా రూ. 2.18 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంబేద్కర్ తన అక్రమ సంపాదనను ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం, శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రసాయన పరిశ్రమ, నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఆరు ఇళ్ల స్థలాలు, వెయ్యి గజాల్లో మామిడి తోట, రెండు కార్లు, భారీగా బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు తేలింది. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇవే కాకుండా, అంబేద్కర్ కారులో రూ.5.50 లక్షల నగదు లభించిందని, ఆయన బ్యాంకు ఖాతాల్లో రూ.78 లక్షల బ్యాలెన్స్, షేర్లలో రూ.36 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే అంబేద్కర్ తన భార్యతో కలిసి 'అంతర్ కెమికల్స్' అనే కంపెనీని నడుపుతున్నట్లు, అందులో డైరెక్టర్‌గా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు.

గత పదేళ్లుగా గచ్చిబౌలి, పటాన్‌చెరు వంటి కీలక ప్రాంతాల్లో పనిచేసిన అంబేద్కర్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొందరు విద్యుత్ అధికారులు బినామీ పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి అంబేద్కర్‌ను అరెస్టు చేసిన అధికారులు, ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి కస్టడీ కోరనున్నట్లు తెలిపారు. బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News