లండన్‌లో దిగ్గజ వ్యాపారవేత్తలతో మంత్రి నారా లోకేశ్ సమావేశం

  • లండన్‌లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో సమావేశం
  • పలు దిగ్గజ కంపెనీల సీనియర్ అధినేతలతో కీలక చర్చలు
  • భేటీలో పాల్గొన్న కంపెనీల నికర విలువ రూ.14 లక్షల కోట్లు!
  • ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్న ఆయన, అక్కడ పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి, ఏపీని ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా లండన్‌లో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన కార్పొరేట్ సంస్థల నికర విలువ సుమారు 170 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 14 లక్షల కోట్లకు పైగా) ఉంటుందని ఆయన స్వయంగా వెల్లడించారు. లండన్‌లోని సీనియర్ వ్యాపారవేత్తలతో జరిగిన ఈ భేటీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్‌లో సీనియర్ వ్యాపార నాయకులతో చర్చిస్తున్నాను. ఈ గదిలో ఉన్న కార్పొరేట్‌ల నికర విలువ 170 బిలియన్ డాలర్లని నా బృందం నాకు తెలియజేసింది" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 

ఈ ఉన్నత స్థాయి సమావేశం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల  అవకాశాలను మంత్రి లోకేశ్ వారికి వివరించారు. 

గత 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని,  రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం ఒక లక్ష ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని లోకేశ్ తెలిపారు. మరో ఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీరంగం వంటి అంశాలను ఈ సమావేశంలో లోకేశ్ హైలైట్ చేశారు. పెట్టుబడులతోపాటు శాశ్వత ఆర్థికావకాశాలను ఇన్వెస్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు. 




More Telugu News