అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వరుడిది: భూమనపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్

  • అలిపిరి వద్ద మహావిష్ణువు విగ్రహం పడేశారంటూ భూమన ఆగ్రహం
  • ఆ విగ్రహంతో టీటీడీకి సంబంధం లేదన్న భానుప్రకాశ్ రెడ్డి
  • భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ పాలకమండలి సభ్యులు తీవ్రంగా స్పందించారు. అలిపిరి వద్ద నిర్లక్ష్యంగా పడేశారని చెబుతున్న విగ్రహం శ్రీ మహావిష్ణువుది కాదని, అది శనీశ్వరుడి విగ్రహమని వారు స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అలిపిరి వద్ద ఉన్న శిల్పకళా క్వార్టర్స్‌కు, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. "బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు అక్కడి శిల్పులకు శనీశ్వరుడి విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చారు. కానీ, తర్వాత దానిని తీసుకువెళ్లలేదు. ఆ విగ్రహాన్ని చూపించి భూమన అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయనకు శనీశ్వరుడి విగ్రహానికి, మహావిష్ణువు విగ్రహానికి కూడా తేడా తెలియకపోవడం విచారకరం" అని ఎద్దేవా చేశారు. ఈ తప్పుడు ప్రచారానికి గాను కరుణాకర్ రెడ్డి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా భూమనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. "టీటీడీపై నిరాధారమైన వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాబోయే పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటాం. భూమన చేసే ఫేక్ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దు" అని సూచించారు. కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదని ఎంఎస్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.




More Telugu News