డబ్బు కోసమే పాక్‌తో మ్యాచ్.. దేశభక్తి ఏమైంది?: కేంద్రంపై శివసేన ఫైర్

  • బీజేపీ దేశభక్తి, హిందుత్వం డొల్ల అని తేలిపోయిందని విమర్శ
  • ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్‌కు వేల కోట్ల లబ్ధి చేకూరిందని ఆరోపణ
  • ఆ డబ్బు ఉగ్రవాదాన్ని పెంచేందుకేనని ‘సామ్నా’ పత్రికలో వ్యాఖ్య
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కోసమే ఈ మ్యాచ్ అని ధ్వజం
  • దేశభక్తులు మ్యాచ్ మొదలవగానే టీవీలు ఆపేశారని పేర్కొన్న శివసేన (యూబీటీ)
దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ వ్యవహారంపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే-యూబీటీ) వర్గం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ ఒక్క మ్యాచ్‌తో బీజేపీ దేశభక్తి, హిందుత్వ వాదనల్లోని ద్వంద్వ వైఖరి, కపటత్వం బట్టబయలయ్యాయని మండిపడింది. ఈ మేరకు తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఘాటు విమర్శలు చేసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఉన్నందునే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అనుమతించారని శివసేన (యూబీటీ) ఆరోపించింది. జై షా దేశభక్తి కోసం కాకుండా, డబ్బు సంపాదించడమే వ్యాపారంగా పెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉగ్రవాదులకు బహిరంగంగా ఆర్థిక చేయూతనిస్తోందని, దీనిని ప్రతి భారతీయుడు ఖండించాలని పేర్కొంది.

దుబాయ్‌లో జరిగిన మ్యాచ్ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కనీసం రూ. 1,000 కోట్లు అందాయని, బెట్టింగ్ ద్వారా మరో రూ. 50,000 కోట్లు పాకిస్థాన్‌లోని జూదరులకు చేరాయని ‘సామ్నా’ ఆరోపించింది. ఈ చర్య ద్వారా భారత్‌లో ఉగ్రవాదాన్ని సృష్టించే శక్తుల చేతులను కేంద్ర ప్రభుత్వమే బలోపేతం చేసిందని విమర్శించింది.

ఒక పాకిస్థానీ నటి ఉందని దిల్జిత్ దోసాంజ్ సినిమా విడుదలను వ్యతిరేకించిన వారు, పాకిస్థాన్‌కు వేల కోట్లు ఆర్జించిపెట్టే ఆసియా కప్ మ్యాచ్‌ను ఎలా అనుమతించారని శివసేన ప్రశ్నించింది. నిజమైన దేశభక్తులు మ్యాచ్ మొదలవగానే తమ టీవీలను కట్టేశారని వ్యాఖ్యానించింది. 

ఈ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్, నటుడు నానా పటేకర్ గతంలో పాక్‌తో మ్యాచ్‌లను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేసింది. "పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ, క్రికెటర్లు దానిని అంగీకరించాల్సిందే" అని గవాస్కర్ అన్నారని పేర్కొంది. అలాగే, "నా ప్రజల రక్తాన్ని చిందించిన వారితో నేనెందుకు ఆడాలి?" అని నానా పటేకర్ ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించింది.




More Telugu News