రైతులు, కౌలు రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ .. యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం

  • రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
  • కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రైతులకు ప్రోత్సాాహకంగా ఇస్తామన్న చంద్రబాబు
  • రబీ సీజన్ లో అధార్ అనుసంధానంతో ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ చేయాలన్న సీఎం
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అందించే ప్రోత్సాహకాలను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర జీఎస్‌డీపీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాలను సమర్థంగా నిర్వహించి ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసినప్పటికీ, ఎరువుల శాఖలో మార్పులు చేయలేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

రబీ సీజన్‌లో యూరియా కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ-క్రాప్ డేటా ఆధారంగా ప్రతి రైతుకు అవసరమైన యూరియా పరిమాణాన్ని గుర్తించాలని, అవసరమైతే ఆధార్ అనుసంధానంతో ఇంటికే ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు.

పంటల అమ్మకాల విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రైతుకు లాభదాయకమైన వ్యవసాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News