ఏఐ కంటెంట్‌పై ఉక్కుపాదం.. క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి!

  • ఏఐ కంటెంట్‌ సృష్టికర్తలకు తప్పనిసరిగా లైసెన్స్
  • తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలకు సిఫారసు
  • ఏఐతో రూపొందించిన కంటెంట్‌కు ప్రత్యేక ట్యాగ్ ఉండాలి
  • ఐటీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సూచనలు
  • లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక సమర్పించిన కమిటీ
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న నకిలీ వార్తలు, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలకమైన సిఫారసులు చేసింది. ఏఐ కంటెంట్‌ను సృష్టించేవారికి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేని వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠినంగా శిక్షించాలని సూచించింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ మేరకు తన నివేదికను ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏది అసలు ఫొటోనో, ఏది ఏఐతో సృష్టించిందో గుర్తించడం కష్టంగా మారింది. ఇదే అదనుగా కొందరు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన కమిటీ, దీని నియంత్రణకు పటిష్ఠమైన నిబంధనలు అవసరమని అభిప్రాయపడింది. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఏఐతో కంటెంట్‌ను రూపొందించేలా చూడాలని, దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది.

దీంతో పాటు, ఏఐతో రూపొందించిన ప్రతి ఫొటో, వీడియో లేదా వార్తా కథనానికి "ఏఐతో రూపొందించారు" అనే ట్యాగ్‌ను కచ్చితంగా జత చేయాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. దీనివల్ల సాధారణ ప్రజలు ఏది నిజమైన సమాచారమో, ఏది కృత్రిమంగా సృష్టించిందో సులభంగా గుర్తించగలరని వివరించింది. కమిటీ చేసిన ఈ సిఫారసులు చట్టరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది.




More Telugu News