చరిత్ర చెరిపేస్తే చెరగదు: విడదల రజని

  • ఐదు మెడికల్ కాలేజీలపై మాజీ మంత్రి విడదల రజని ట్వీట్
  • రెండు సంవత్సరాల క్రితం కాలేజీలు ప్రారంభమయ్యాయని వెల్లడి
  • ఇది జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయమన్న మాజీ మంత్రి
వైసీపీ హయాంలో రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై మాజీ మంత్రి విడదల రజని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చరిత్ర చెరిపేస్తే చెరగదు" అంటూ ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలను, సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం, అంటే 2023 సెప్టెంబర్ 15న, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకేసారి ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను చారిత్రాత్మక రీతిలో ప్రారంభించుకున్నామని తెలిపారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాల్లో ఈ కళాశాలలు ప్రారంభమైనట్లు తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటును కేవలం విద్యా సంస్థల ప్రారంభోత్సవంగా చూడకూడదని విడదల రజని అభిప్రాయపడ్డారు. "ఇవి కేవలం కాలేజీలు కావు.... రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వైఎస్ జగన్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయం.. ఇది వైసీపీ ముద్ర" అని ఆమె తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ కళాశాలల ఏర్పాటు వెనుక జగన్ దార్శనికత ఉందని ఆమె కొనియాడారు. 


More Telugu News