ఒక ఫ్లాప్‌కే అలా దిగజారాలా?: దర్శకుడు మారుతి సంచలన వ్యాఖ్యలు

  • సినిమా పోతే చెప్పుతో కొట్టుకుంటారా? అంటూ మారుతి ఆవేదన
  • ఆ డైరెక్టర్ ను చూసి చాలా బాధపడ్డానని వ్యాఖ్య
  • ఒక ఫ్లాప్‌కే అంతలా దిగజారొద్దు అని హితవు
ప్రముఖ దర్శకుడు మారుతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే కొందరు దర్శకులు చేస్తున్న పనుల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఆడకపోతే చెప్పుతో కొట్టుకోవడం, సినిమాలు మానేస్తానని ప్రకటించడం వంటి పిచ్చి పనులతో ఎందుకు ఇంతలా దిగజారాలని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు.

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ‘బ్యూటీ’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకకు మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలి ఒక సంఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. "ఒక దర్శకుడు తీసిన ‘త్రిబాణదారి బార్బరిక్’ సినిమా ఆడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. ఆ టైటిల్ ఎవరికీ అర్థం కాదని చెప్పినా వినలేదు. ఆయనేదో ట్రాన్స్‌లో, దేవుడిననే ఫీలింగ్‌లో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని కాదనలేకపోయా. కానీ సినిమా ఫ్లాప్ అయిందని అలా చేయడం చూసి చాలా బాధేసింది" అని మారుతి తన ఆవేదనను పంచుకున్నారు.

కళాకారులను తయారుచేసే వాళ్లు ఇలాంటి పనులు చేయకూడదని ఆయన హితవు పలికారు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారని, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. "ఒక సినిమా ఆడకపోతే మరో సినిమా ఆడుతుంది. అంతేకానీ ఇంతగా దిగజారాలా?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో తన కెరీర్‌పై వస్తున్న విమర్శలపైనా మారుతి స్పందించారు. "నన్ను చాలామంది బూతు డైరెక్టర్ అంటుంటారు. నేను రాసినన్ని మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ఎవరూ రాయలేరు. కానీ కుటుంబాలు సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలాంటివి రాయడం లేదు. ఇప్పుడు అదే బూతు డైరెక్టర్ 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ సినిమా తీస్తున్నాడు. నా ఎదుగుదల చూడండి. ఒక ఫ్లాప్ తర్వాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో పిలిచి మరీ అవకాశం ఇచ్చారంటే ఊరికే కాదు. ఆయన మనసులో నేనున్నాను" అంటూ తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం మారుతి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


More Telugu News