మావోయిస్టు అగ్ర నేత హిడ్మాను చుట్టుముట్టిన బలగాలు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్?

  • మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఆచూకీ లభ్యం!
  • త్వరలోనే పట్టుకుంటామన్న బస్తర్ ఐజీ
  • మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపు
  • బీజాపూర్ జిల్లాలో కొత్త పోలీస్ క్యాంప్
  • మావోయిస్టు ప్రభావిత చిల్లమరలో ఏర్పాటు
మావోయిస్టు పార్టీ కీలక నేత, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి మాద్వి హిడ్మా ఆచూకీ లభ్యమైందని, అతడిని పట్టుకోవడం ఇక లాంఛనమేనని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ సంచలన ప్రకటన చేశారు. హిడ్మా ప్రస్తుతం భద్రతా బలగాల రాడార్‌లోనే ఉన్నాడని, అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హిడ్మా కదలికలను నిశితంగా గమనిస్తున్నట్టు  సుందర్‌రాజ్ తెలిపారు. "హిడ్మా మా బలగాల రాడార్‌లోకి వచ్చాడు. అతడిని పట్టుకోవడమే తరువాయి" అని ఆయన స్పష్టం చేశారు. అడవుల్లో ఉన్న ఇతర మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా ఐజీ సూచించారు.

ఇదిలా ఉండగా, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు సోమవారం మరో కీలక ముందడుగు వేశాయి. బీజాపూర్ జిల్లాలోని చిల్లమర గ్రామంలో సరికొత్త పోలీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడ భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అనేక ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. వ్యూహాత్మకంగా ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయవచ్చని బలగాలు భావిస్తున్నాయి.


More Telugu News