స్కూల్లో డ్రగ్స్ తయారీ.. ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

  • పాతబోయినపల్లిలో వెలుగుచూసిన ఘటన 
  • ప్రైవేటు పాఠశాల భవనంలో మత్తు పదార్ధాల తయారీ
  • ముగ్గురు నిందితులు అరెస్టు
  • 1 కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం 
హైదరాబాద్ మహానగరంలోని పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం పోలీసులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల రెండో అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి, రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.

దాడిలో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు:

పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాశ్ గౌడ్ రెండు గదుల్లో అల్ప్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి, 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్టు విచారణలో తేలింది.

ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే, అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతోంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నాడు.

పోలీసుల సోదాల్లో స్వాధీనం:

సోదాల అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, దాదాపు రూ. కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

విద్యార్థుల భద్రతపై ఆందోళన:

ప్రస్తుతం పాఠశాలలో పదో తరగతి వరకు విద్య కొనసాగుతోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు చదువుకునే చోటే మత్తు పదార్థాల తయారీ జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

తదుపరి విచారణ:

ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం.. నిందితులు అల్ప్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తోంది. 


More Telugu News