అమరావతిపై వైసీపీ తీరు 'అందితే జుట్టు అందకపోతే కాళ్లు' అన్నట్టుంది: తెనాలి శ్రావణ్ కుమార్

  • సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఫైర్ 
  • ఎన్నికల కోసమే అమరావతిపై కొత్త డ్రామా ఆడుతున్నారంటూ ఆగ్రహం
  • విధానపరమైన ప్రకటనలు చేసే అర్హత సజ్జలకు లేదని స్పష్టీకరణ 
  • గతంలో విషం చిమ్మి.. ఇప్పుడు ప్రేమ నటిస్తున్నారని విమర్శలు
  • మూడు ప్రాంతాల ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై తీవ్రమైన విష ప్రచారం చేసి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నక్కజిత్తులకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో వైసీపీ నాయకుల వైఖరి "అందితే జుట్టు, అందకపోతే కాళ్లు" పట్టుకునే చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిన్న ఓ న్యూస్ కాంక్లేవ్‌లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని కట్టాలంటూ కొత్త భాష్యం చెప్పడాన్ని శ్రావణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. "గతంలో తాడేపల్లి గుమస్తాగా పేరుపొందిన సజ్జలకు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే అర్హత ఎక్కడిది? అసలు ఆయన హోదా ఏమిటి? మాట్లాడాల్సి వస్తే పార్టీ అధినేత జగన్ మాట్లాడాలి. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే సజ్జల తెరపైకి వచ్చారు. ఆయన మాటల ద్వారా వైసీపీ మరో కుట్రకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది" అని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. జగన్, సజ్జల ఇద్దరూ మోసానికి ప్రతిరూపంగా నిలిచారని ఆయన విమర్శించారు.

వైసీపీ ద్వంద్వ వైఖరిని శ్రావణ్ కుమార్ గణాంకాలతో సహా వివరించారు. "2014-19 మధ్య అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగినప్పుడు, రాష్ట్ర విభజనతో నష్టపోయామని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దని, విజయవాడ-గుంటూరు మధ్య 30 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సాక్షాత్తూ జగన్ చెప్పారు. 2019 ఎన్నికల ముందు, అమరావతిలో ఇల్లు కట్టుకొని, పార్టీ ఆఫీసు నిర్మించుకొని ఈ ప్రాంతంపై ప్రేమ ఉన్నట్లు నటించారు. చంద్రబాబుకు ఇక్కడ ఇల్లు కూడా లేదని, టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిని తరలిస్తారని దుష్ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జీఎన్ రావు, బోస్టన్ కమిటీల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మూడు రాజధానుల నాటకాన్ని ప్రారంభించారు" అని ఆయన గుర్తుచేశారు.

గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు అమరావతిపై చేసిన వ్యాఖ్యలను శ్రావణ్ కుమార్ ప్రస్తావించారు. "అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఎడారి అని హేళన చేశారు. ఒక వ్యక్తి ఇది వేశ్యల రాజధాని అని నీచంగా మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి పనికిరాదని, ముంపు ప్రాంతమని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ దొంగ సర్టిఫికెట్లు సృష్టించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసి, ఐదేళ్ల పాలనలో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేకపోయారు. అమరావతి రైతులపై దాడులు చేయించి, చిత్రహింసలకు గురిచేశారు. ఇన్ని చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అమరావతే రాజధాని అంటారు?" అని ఆయన ప్రశ్నించారు.

అమరావతిలో భవనాలు లేవని చెప్పిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఉన్న భవనాలే పరిపాలనకు సరిపోతాయని చెప్పడం వారి మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. "చంద్రబాబు కట్టిన సచివాలయం, ఇతర భవనాలు కాకుండా మీరేమైనా ఒక్క ఇటుకైనా వేశారా? కానీ రుషికొండకు గుండు కొట్టి వందల కోట్ల రూపాయలతో సొంత ప్యాలెస్ కట్టుకున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి హామీలను గాలికొదిలేసిన జగన్, ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మాట మార్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు" అని శ్రావణ్ కుమార్ విమర్శించారు.

"వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జగన్ స్వయంగా మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి, మూడు రాజధానుల నిర్ణయం తప్పని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పటి వరకు మీ మాటలను ప్రజలు నమ్మరు" అని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News