బ్రిటన్‌లో పేట్రేగుతున్న జాత్యహంకారం.. సిక్కు యువతిపై ఘోరం

  • యూకేలోని ఓల్డ్‌బరీలో 20 ఏళ్ల సిక్కు యువతిపై అత్యాచారం
  • ఇద్దరు శ్వేతజాతీయుల పనేనని పోలీసుల అనుమానం
  • "మీ దేశానికి తిరిగి వెళ్లండి" అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు
  • జాత్యహంకార దాడిగా కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
  • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత సంతతి బ్రిటిష్ ఎంపీలు
బ్రిట‌న్‌లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓల్డ్‌బరీ పట్టణంలో ఇరవై ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో అవమానించిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. "మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి" అంటూ ఆమెపై దుండగులు అరిచినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ దాడితో బ్రిటన్‌లోని భారత సంతతి సమాజం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది.

గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను సాధారణ నేరంగా కాకుండా 'జాత్యహంకార ప్రేరేపిత దాడి'గా పరిగణించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు శ్వేతజాతీయులని, వారిలో ఒకరు గుండుతో ముదురు రంగు స్వెట్‌షర్ట్ ధరించి ఉండగా, మరొకరు గ్రే కలర్ టాప్ వేసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ దాడిపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆందోళన అర్థం చేసుకోగలమని చెప్పిన ఓ సీనియర్ పోలీస్ అధికారి, ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతామని హామీ ఇచ్చారు.

భారత సంతతి ఎంపీల తీవ్ర ఖండన
ఈ ఘటనపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. బర్మింగ్‌హామ్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ, "ఇది అత్యంత క్రూరమైన హింస. బాధితురాలు ఇక్కడికి చెందిన వ్యక్తి కాదు అని దుండగులు చెప్పడం దారుణం. కానీ, ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది. బ్రిటన్‌లో జాత్యహంకారానికి, స్త్రీ ద్వేషానికి చోటు లేదు" అని అన్నారు.

మరో ఎంపీ జస్ అత్వాల్ ఈ దాడిని "హేయమైన, జాత్యహంకార, స్త్రీద్వేషపూరిత దాడి"గా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ ఘోరమని, దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నెల రోజుల క్రితం వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు టీనేజర్లు దాడి చేసిన ఘటన మరవకముందే ఈ దారుణం జరగడం గమనార్హం.


More Telugu News