ప్రిన్సిపాల్‌పై పిచ్చి వ్యామోహం.. తోటి టీచర్‌పై అసూయ..AIతో ప్రతీకారం!

  • ఢిల్లీలో 22 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్న సైబర్ పోలీసులు
  • తోటి టీచర్ ఫొటోలు మార్ఫింగ్
  • స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఉన్న పిచ్చి ప్రేమతోనే ఈ దారుణం
ఒక స్కూల్ ప్రిన్సిపాల్‌పై పెంచుకున్న వన్‌సైడ్ లవ్ ఒక యువతిని దారుణమైన చర్యలకు పాల్పడేలా చేసింది. తన ప్రేమకు అడ్డు వస్తోందని భావించిన సహోద్యోగిపై కక్ష పెంచుకుని, ఆమె ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఓ మాజీ టీచర్‌ను ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు.

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 25 ఏళ్ల టీచర్, గుర్తుతెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరించి స్కూల్ విద్యార్థులకు, ఇతర సిబ్బందికి ఫాలో రిక్వెస్ట్‌లు పంపుతూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇన్‌స్పెక్టర్ రోహిత్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఐపీ లాగ్స్, రిజిస్టర్డ్ ఈమెయిల్స్ వంటి సాంకేతిక వివరాలను సేకరించి విశ్లేషించింది. ఈ ఆధారాలతో, గతంలో అదే పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేసి 2022లో ఉద్యోగం మానేసిన 22 ఏళ్ల యువతిని నిందితురాలిగా గుర్తించారు. పాత ఢిల్లీలో నివసిస్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితురాలు గతంలో తనకు పాఠాలు చెప్పిన గురువు, ప్రస్తుతం అదే పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తిపై తీవ్రమైన వ్యామోహం పెంచుకుంది. ఆయన దృష్టిని ఆకర్షించేందుకు తనకు క్యాన్సర్ ఉందని, చివరికి తను చనిపోయినట్లు కూడా నాటకాలు ఆడింది. అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, ప్రిన్సిపాల్‌తో బాధితురాలైన టీచర్ సన్నిహితంగా ఉంటోందని భావించి ఆమెపై పగ పెంచుకుంది. బాధితురాలి ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి, నకిలీ ఖాతాలలో పోస్ట్ చేసినట్లు అంగీకరించింది.

అంతేకాకుండా, నిందితురాలు క్షుద్రపూజల వైపు కూడా మొగ్గు చూపినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె దగ్గర నుంచి కొన్ని చేతిరాత చీటీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై వింత గుర్తులు, అంకెలతో పాటు తన పేరు, ప్రిన్సిపాల్ పేరు రాసి ఉండటం ఆమెకున్న తీవ్రమైన వ్యామోహాన్ని స్పష్టం చేస్తోందని పోలీసులు తెలిపారు. 


More Telugu News