రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఝార్ఖండ్‌లో నిందితుల అరెస్ట్

  • కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి
  • ఝార్ఖండ్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసుల ఏర్పాట్లు
  • నమ్మకంగా చేరిన వంట మనిషే ప్రధాన నిందితుడు
  • డబ్బు, బంగారం కోసమే దారుణానికి పాల్పడిన వైనం
హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి భార్య రేణు అగర్వాల్ (50) హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు ఝార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే రాకేశ్ అగర్వాల్, రేణు దంపతులు ఫతేనగర్‌లో స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి ఇంట్లో వంట చేసేందుకు కొద్ది రోజుల క్రితమే హర్ను అనే యువకుడు పనిలో చేరాడు. రేణు బంధువుల ఇంట్లో గత తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న రోషన్ అనే మరో వ్యక్తి.. తన గ్రామస్థుడైన హర్నును ఇక్కడ పనికి కుదిర్చాడు.

బుధవారం ఉదయం రాకేశ్, ఆయన కుమారుడు శుభం షాపునకు వెళ్లిన తర్వాత ఇంట్లో రేణు ఒంటరిగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన హర్ను, రోషన్ కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి, ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా మోది కిరాతకంగా హత్య చేశారు.

అనంతరం ఇంట్లోని లాకర్లు పగులగొట్టి నగదు, నగలు దోచుకుని ఒక సూట్‌కేసులో సర్దుకున్నారు. హత్య తర్వాత స్నానం చేసి, రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి వేరే బట్టలు వేసుకున్నారు. ఇంటికి తాళం వేసి, అగర్వాల్ కుటుంబానికి చెందిన స్కూటీపైనే పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో వారు సూట్‌కేసుతో వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

సాయంత్రం భర్త, కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రేణు రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఝార్ఖండ్‌లో ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితులను నగరానికి తీసుకొచ్చి విచారించనున్నారు.


More Telugu News