నేపాల్ రాజకీయాల్లో మరో మలుపు: తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ.. నేడే ప్రమాణ స్వీకారం

  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ
  • యువతరం నిరసనలతో దిగివచ్చిన ప్రభుత్వం, సైన్యం
  • అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్‌తో చర్చల అనంతరం ఏకాభిప్రాయం
  • శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రమాణ స్వీకారం
  • పార్లమెంటును రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసే అవకాశం
నేపాల్ రాజకీయాల్లో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నేపాల్ రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తాత్కాలిక ప్రధానిగా పలువురి పేర్లు వినిపించాయి. రెండు రోజుల పాటు తాత్కాలిక ప్రధాని ఎవరనే అంశంపై చర్చలు జరిగాయి.

ఎట్టకేలకు తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆమె పేరును జెన్ జెడ్ ఉద్యమకారులు ఎంపిక చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమంపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా యువతరం (జెన్-జీ) చేపట్టిన తీవ్ర నిరసనల ఫలితంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, జెన్-జీ నిరసనకారులు, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. అందరి మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు సుశీల కర్కీని ఆపద్ధర్మ ప్రధానిగా నియమించేందుకు మార్గం సుగమమైంది. ఆమె నేతృత్వంలో చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం రాత్రే తొలి మంత్రివర్గ సమావేశం జరిపి, ఫెడరల్ పార్లమెంటుతో పాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, తాత్కాలిక ప్రధాని పదవికి తొలుత పలువురి పేర్లు వినిపించాయి. దేశ విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించి పేరుగాంచిన ఇంజినీర్ కుల్మన్ ఘీసింగ్‌ పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అదేవిధంగా, నిరసనకారుల్లో మంచి ఆదరణ ఉన్న ఖాట్మండు మేయర్, ర్యాపర్-రాజకీయవేత్త బాలేంద్ర షా కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రధాని పదవి చేపట్టేందుకు ఆయన ఆసక్తి చూపలేదని, సుశీలా కర్కీ అభ్యర్థిత్వానికే మద్దతు తెలిపారని సమాచారం. దీంతో, అన్ని వర్గాల ఆమోదంతో సుశీల కర్కీ ఎంపిక ఖరారైంది.


More Telugu News