అల్పపీడనానికి తోడు ద్రోణి... ఏపీఎస్డీఎంఏ అలర్ట్

  • బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ప్రభావం
  • తీరం వెంబడి గంటకు 60 కి.మీ వేగంతో బలమైన గాలులు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక
  • శనివారం 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల అంచనా
  • మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వర్ష సూచన జారీ అయింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఒక ద్రోణి కూడా కొనసాగుతోందని, దీని కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక సూచనలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఈ అల్పపీడనం ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 13) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 


More Telugu News