టేకాఫ్ సమయంలో ఊడిన టైరు... స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

  • కాండ్లా నుంచి ముంబై వెళుతున్న స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం
  • టేకాఫ్ అవుతుండగా ఊడిపడిన టైరు
  • ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండింగ్
  • నిన్న ఢిల్లీలో మరో స్పైస్‌జెట్ విమానంలో మంటల కలకలం
ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు భద్రతాపరమైన సంఘటనలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఓ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో దాని టైరు ఊడి కిందపడిపోగా, గురువారం మరో విమానం ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ క్యూ400 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని వెలుపలి టైరు ఒకటి ఊడి రన్‌వేపై పడిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు. అయినప్పటికీ, విమానం తన ప్రయాణాన్ని కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యాక సొంతంగా టెర్మినల్‌కు చేరుకుందని, ప్రయాణికులందరూ మామూలుగానే కిందకు దిగారని ఆయన వివరించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా, గురువారం ఢిల్లీ విమానాశ్రయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖాట్మండు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (బోయింగ్ 737-8) టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా, దాని టెయిల్‌పైప్ (ఇంజిన్ వెనుక భాగం) నుంచి మంటలు వస్తున్నట్లు మరో విమాన సిబ్బంది గుర్తించి సమాచారం ఇచ్చారు. కాక్‌పిట్‌లో ఎలాంటి హెచ్చరికలు రానప్పటికీ, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది.

భారీ నష్టాల్లో సంస్థ
ఒకవైపు వరుస భద్రతాపరమైన ఘటనలు జరుగుతుండగా, మరోవైపు స్పైస్‌జెట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కంపెనీ ఏకంగా రూ. 234 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రూ. 158 కోట్ల లాభం రాగా, ఈసారి భారీ నష్టాలు రావడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ. 1,708 కోట్ల నుంచి రూ. 1,120 కోట్లకు పడిపోయింది. నిర్వహణకు దూరంగా ఉన్న విమానాల ఖర్చులు, కొన్ని దేశాల్లో గగనతల ఆంక్షల వల్లే ఈ నష్టాలు వచ్చాయని సంస్థ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.



More Telugu News