భర్త నుంచి వేరుపడటమే ఆమె పాలిట శాపమైంది.. నేపాల్‌లో ఘజియాబాద్ మహిళ మృతి

  • పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన ఘజియాబాద్ జంట
  • నేపాల్ అల్లర్లలో వారు బస చేసిన హోటల్‌కు నిప్పు
  • ప్రాణాలతో బయటపడ్డా గందరగోళంలో విడిపోయిన భార్యాభర్తలు
  • భర్త కనపడలేదన్న షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన భార్య రాజేశ్ గోలా
పవిత్ర పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన దంపతుల జీవితంలో ఆ పర్యటన తీవ్ర విషాదాన్ని నింపింది. నేపాల్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా వారు బస చేసిన హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో మంటల నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, భర్త నుంచి విడిపోయానన్న తీవ్ర ఆందోళనతో భార్య ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన ఘజియాబాద్‌లో విషాద ఛాయలు అలముకునేలా చేసింది.

ఘజియాబాద్‌లోని హర్బన్స్ నగర్‌కు చెందిన రామ్‌వీర్ సింగ్ గోలా, ఆయన భార్య రాజేశ్ గోలా (57) ఈ నెల 7న నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. పశుపతినాథుని దర్శించుకోవడమే వారి పర్యటన ఉద్దేశం. అయితే, వారు వచ్చిన రెండో రోజే.. అంటే ఈ నెల  9న రాత్రి నగరంలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు వారు బస చేస్తున్న హోటల్‌కు నిప్పుపెట్టారు.

హోటల్‌లో మంటలు వ్యాపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. మూడో అంతస్తులో ఉన్న రామ్‌వీర్ దంపతులను తాళ్ల సాయంతో కిందకు దించారు. ఈ క్రమంలో రాజేశ్ గోలా జారిపడినా వెంటనే లేచి నిలబడ్డారు. అయితే, ఆ గందరగోళంలో హోటల్ సిబ్బంది భార్యాభర్తలను వేర్వేరు దారుల్లోకి తీసుకెళ్లారు.

"అల్లర్ల నుంచి కాపాడే క్రమంలో మా అమ్మానాన్నలు విడిపోయారు. హఠాత్తుగా భర్త కనిపించకపోవడంతో అమ్మ తీవ్రమైన షాక్‌కు గురయ్యారు. ఆ ఆందోళనతోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఆమెకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందలేదు. ఒకవేళ వారిద్దరూ కలిసే ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదు" అని వారి కుమారుడు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం రామ్‌వీర్ సింగ్ గోలా తన భార్య మృతదేహంతో రోడ్డు మార్గంలో ఘజియాబాద్‌కు పయనమయ్యారని, తాము ఆయనతో నిరంతరం మాట్లాడుతున్నామని విశాల్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఖాట్మండులో కర్ఫ్యూను కొన్ని గంటల పాటు సడలించడంతో వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదిగా తిరిగి ప్రారంభమయ్యాయి.


More Telugu News