Arjun Tendulkar: ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar Shines as All Rounder After Break
  • కేఎస్‌సీఏ టోర్నీలో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
  • మహారాష్ట్రపై ఐదు వికెట్లు పడగొట్టిన సచిన్ తనయుడు
  • తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టిన వైనం
  • బ్యాటింగ్‌లోనూ రాణించిన అర్జున్.. 36 పరుగులు
  • ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగి సత్తా చాటిన అర్జున్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ బంతితో అద్భుతం చేశాడు. సుమారు ఏడు నెలల విరామం తర్వాత తిరిగి పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అర్జున్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న డాక్టర్ (కెప్టెన్) కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో గోవా తరఫున ఆడుతూ మహారాష్ట్ర జట్టు పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో అర్జున్, తన తొలి ఓవర్ మొదటి బంతికే మహారాష్ట్ర ఓపెనర్ అనిరుధ సబాలేను పెవిలియన్‌కు పంపాడు. అక్కడితో ఆగకుండా మరో ఓపెనర్ మహేశ్‌ మస్కేను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. తన పదునైన బౌలింగ్‌ను కొనసాగిస్తూ దిగ్విజయ్ పాటిల్ వికెట్లను గిరాటేశాడు. దీంతో మహారాష్ట్ర 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, మెహుల్ పటేల్ (54) కాసేపు పోరాడాడు. అయితే, అతడిని కూడా 39వ ఓవర్‌లో అర్జున్ ఔట్ చేయడంతో మహారాష్ట్ర కోలుకోలేకపోయింది. చివరగా నదీమ్ షేక్‌ను కూడా పెవిలియన్‌కు పంపి అర్జున్ తన ఐదు వికెట్ల ఫీట్‌ను పూర్తి చేశాడు. అతని ధాటికి మహారాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించిన అర్జున్, 9వ స్థానంలో బరిలోకి దిగి 44 బంతుల్లో 36 పరుగులు చేశాడు. గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు సాధించింది. అభినవ్ తేజ్రానా (77), దర్శన్ మిసల్ (61), మోహిత్ రెడ్కర్ (58) అర్ధ సెంచరీలతో రాణించారు. గతంలో మహారాష్ట్ర తరఫున దేశవాళీ టీ20 టోర్నీలు ఆడిన అర్జున్, 2022లో గోవా జట్టుకు మారాడు. ఇటీవలే తన స్నేహితురాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత అర్జున్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.
Arjun Tendulkar
Arjun Tendulkar cricket
Sachin Tendulkar son
Goa cricket
KSCA tournament
Dr Thimmappayya Memorial Tournament
Mumbai Indians
Sania Chandok
Arjun Tendulkar engagement
Maharashtra cricket

More Telugu News