Kerala Panchayat: పెళ్లి కొడుకులు 3000 మంది... వధువులు 200.. కేరళ పంచాయతీ వినూత్న పథకానికి విచిత్ర స్పందన

Kerala Panchayat Scheme Receives Unexpected Response 3000 Grooms 200 Brides
  • ‘పయ్యావూర్ మాంగల్యం’ పేరుతో సామూహిక వివాహాలకు శ్రీకారం
  • వరుల నుంచి 3000 దరఖాస్తులు.. వధువుల నుంచి కేవలం 200
  •  పురుషుల నుంచి వెల్లువెత్తిన దరఖాస్తులతో రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేత
పెళ్లి కాని యువతకు సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో కేరళలోని ఓ గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అయితే, ఈ స్పందన అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివాహం కోసం యువకుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తగా, యువతుల నుంచి మాత్రం తీవ్ర నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కేరళలోని కన్నూరు జిల్లా పయ్యావూర్ గ్రామ పంచాయతీ 'పయ్యావూర్ మాంగల్యం' పేరుతో సామూహిక వివాహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న ఆర్థిక భారాలు, మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల వివాహానికి ఇబ్బందులు పడుతున్న యువతకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే యువకుల నుంచి భారీ స్పందన వచ్చింది. పయ్యావూర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా పురుషులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, అదే సమయంలో దరఖాస్తు చేసుకున్న యువతుల సంఖ్య 200 మాత్రమే ఉండటం గమనార్హం. వధూవరుల మధ్య ఈ భారీ వ్యత్యాసంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

ఈ నేపథ్యంలో పురుషుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు ప్రకటించారు. అయితే, యువతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మహిళలు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు 'సింగిల్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్' ద్వారా కూడా అవకాశం కల్పించారు.  
Kerala Panchayat
Payyavoor Mangalyam
mass marriage
Kerala
Kannur district
singles womens welfare association
marriage scheme
youth welfare

More Telugu News