Donald Trump: ట్రంప్, మోదీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన నవారో... అమెరికా మాజీ ఎన్ఎస్ఏ

Peter Navarro tried to create rift between Trump Modi says Bolton
  • ట్రంప్ వాణిజ్య సలహాదారుడిపై మాజీ ఎన్ఎస్ఏ సంచలన ఆరోపణలు
  • చైనాతో ఎదురయ్యే సవాళ్లపై ఇరువురు నేతల మధ్య చర్చ
  • అకస్మాత్తుగా టారిఫ్ ల అంశాన్ని ప్రస్తావించిన పీటర్ నవారో
  • ఓ గదిలో గంట పాటు వదిలితే బయటకొచ్చాక తనతో తనే గొడవ పడే రకమంటూ విమర్శ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై ఆ దేశ మాజీ ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్, మోదీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పారు. ఇరువురు నేతల మధ్య సయోధ్యను సహించలేని మనస్తత్వమని విమర్శించారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా పనిచేసిన జాన్ బోల్టన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పీటర్ నవారో వ్యక్తిత్వం ఎలాంటిదంటే.. ఓ గదిలో ఆయనను గంటపాటు ఒంటరిగా వదిలేస్తే బయటకు వచ్చాక తనతో తనే గొడవపడే వ్యక్తి” అంటూ బోల్టన్ విమర్శించారు.
 
భారత ప్రధాని మోదీ, ట్రంప్ ల మధ్య జరిగిన ఓ సమావేశంలో పీటర్ నవారో కూడా పాల్గొన్నారని, చైనాతో ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరిగిందని బోల్టన్ చెప్పారు. ఆ సమయంలో నవారో హఠాత్తుగా టారిఫ్ ల ప్రస్తావన తీసుకొచ్చి ట్రంప్, మోదీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తోందని ఆ మీటింగ్ లో ప్రస్తావించారని చెప్పారు. అయితే, ఇరువురు నేతలు సంయమనం పాటించడంతో గొడవ జరగలేదని బోల్టన్ వివరించారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతున్నప్పుడు చిన్నా చితకా సమస్యలు ఎదురవడం సాధారణమేనని, సంప్రదింపులు, చర్చలతో వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నవారో తీరు మాత్రం సమస్యలు పరిష్కరించడం కన్నా గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నట్లు ఉంటుందని ఆయన ఆరోపించారు.

కాగా, అమెరికా, భారత్ ల మధ్య టారిఫ్ ల గొడవ నేపథ్యంలో ఇటీవల పీటర్ నవారో వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉండడం గమనార్హం. భారత్ ను ‘టారిఫ్ మహారాజా’ అని, రష్యా చమురు కొంటూ ‘బ్లడ్ మనీ’ సంపాదిస్తోందని ఆరోపించాడు. రష్యా, చైనాలతో దోస్తీ నేపథ్యంలో భారత్ కు దారుణమైన పరిణామాలు తప్పవని బెదిరింపులకు పాల్పడడం కూడా తెలిసిందే.
Donald Trump
Trump Modi
Peter Navarro
John Bolton
India US relations
US tariffs
India tariffs
Trade war
China
Indian Economy

More Telugu News