ప్రత్యర్థులుగా ఫైట్.. స్నేహితులుగా హగ్.. మైదానంలో అరుదైన దృశ్యం!

  • ఆసియా కప్‌లో యూఏఈ, భారత్ మ్యాచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌ 
  • మైదానంలో చిన్ననాటి స్నేహితుల అరుదైన పునఃసమాగమం
  • యూఏఈ బౌలర్ సిమ్రన్‌జీత్ బౌలింగ్‌లో గిల్ విన్నింగ్ షాట్‌
  • మ్యాచ్ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లు
  • చిన్నప్పుడు మొహాలీ అకాడమీలో కలిసి ప్రాక్టీస్
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్ టీమిండియాకు సునాయాస విజయాన్నే అందించినా, ఒక మధురమైన పునఃసమాగమానికి వేదికైంది. ఏళ్ల క్రితం ఒకే అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యూఏఈ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రత్యర్థులుగా తలపడ్డారు. గెలుపును ఖాయం చేసిన ఫోర్ ను సిమ్రన్‌జీత్ బౌలింగ్‌లోనే బాదిన గిల్, వెంటనే అతని వద్దకు వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టును భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే, చిన్ననాటి స్నేహితుడి చేతిలో ఓడినా సిమ్రన్‌జీత్‌కు ఈ మ్యాచ్ జీవితాంతం గుర్తుండిపోతుంది. మ్యాచ్‌కు ముందు సిమ్రన్‌జీత్ మాట్లాడుతూ, తాను శుభ్‌మన్‌ గిల్‌ను మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అకాడమీలో కలిశానని గుర్తుచేసుకున్నాడు. "నాకు శుభ్‌మన్ చిన్నప్పటి నుంచే తెలుసు. కానీ, ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12 సమయంలో మేమిద్దరం మొహాలీ అకాడమీలో ప్రాక్టీస్ చేసేవాళ్లం" అని పీటీఐతో చెప్పాడు.

అయితే, సిమ్రన్‌జీత్ సందేహాలన్నీ మ్యాచ్ ముగిశాక పటాపంచలయ్యాయి. తన బౌలింగ్‌లోనే గిల్ విన్నింగ్ షాట్ కొట్టి, ఆ వెంటనే చిరునవ్వుతో తనను ఆలింగనం చేసుకోవడంతో సిమ్రన్‌జీత్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.


More Telugu News