అది మీ అబ్బ జాగీరు కాదు: చంద్రబాబుపై గుడివాడ అమర్‌నాథ్ ఫైర్

  • మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అమర్‌నాథ్ మండిపాటు
  • పేదలకు విద్య, వైద్యం దూరం చేసే కుట్ర అని విమర్శ
  • నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక 
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన అనంతరం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో జగన్ 17 కొత్త కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించారని అమర్‌నాథ్ గుర్తు చేశారు. "పేద విద్యార్థులను డాక్టర్లను చేయాలనేది జగన్ ఆశయం. పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూ. 8,500 కోట్లతో ఈ కాలేజీల నిర్మాణం చేపట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తోంది" అని ఆయన ఆరోపించారు.

నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం ఇప్పటికే మూడు అంతస్తుల వరకు పూర్తయిందని, దానిని పూర్తి చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ కాలేజీ నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి పంచిపెట్టడానికి ఇవి మీ అబ్బ జాగీరు కాదు. చంద్రబాబు సామాన్యుల మనిషి కాదు, పెట్టుబడిదారుల మనిషి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ ప్రభుత్వం ఈ కళాశాలలను ప్రైవేటుపరం చేసినా, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని ప్రభుత్వపరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని అమర్‌నాథ్ పునరుద్ఘాటించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దని ప్రభుత్వమే లేఖ రాయడం దారుణమని ఆయన విమర్శించారు. 


More Telugu News