అక్కినేని చిన్న కోడలు జైనాబ్ పుట్టినరోజు వేడుకలు

  • హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బర్త్ డే వేడుకలు
  • 'నా ప్రపంచం నువ్వే' అంటూ అఖిల్ ఎమోషనల్ పోస్ట్
  • షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయిన శోభిత
అక్కినేని కుటుంబంలో వేడుకలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. తాజాగా, ఆ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన చిన్న కోడలు జైనాబ్ రావూజీ మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హీరో అఖిల్ అక్కినేని తన భార్యతో ఉన్న ఒక అందమైన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "నా ప్రపంచం నువ్వే" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురూ కలిసి దగ్గరుండి పర్యవేక్షించడం విశేషం. వారు ముగ్గురూ పార్టీ వేదికను సిద్ధం చేస్తున్న ఒక స్టైలిష్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది. తమ కోడలిపై అక్కినేని కుటుంబం చూపిస్తున్న ప్రేమకు, వారి మధ్య ఉన్న బలమైన బంధానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, షూటింగ్ నిమిత్తం శోభిత ధూళిపాళ ఈ వేడుకకు హాజరుకాలేకపోయినట్టు సమాచారం. 

ఢిల్లీకి చెందిన జైనాబ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇండియా, దుబాయ్, లండన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రావూజీ, నాగార్జునకు అత్యంత సన్నిహితుడు. రెండేళ్ల క్రితం స్నేహంగా మొదలైన అఖిల్, జైనాబ్‌ల పరిచయం ప్రేమగా మారి, గత ఏడాది నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. జైనాబ్ రాకతో అఖిల్ కెరీర్‌లో పెద్ద బ్రేక్ వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News