ట్రంప్ హెచ్చరికలు బేఖాతరు.. ‘ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌’ పేరుతో భారత్‌-రష్యా సైనిక విన్యాసాలు

  • రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు ప్రారంభించిన భారత్
  • 'ఎక్సర్‌సైజ్‌ జాపడ్' పేరుతో వారం రోజుల పాటు కసరత్తు
  • నిజ్నీ నగరంలో జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాలు
అంతర్జాతీయంగా అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ, భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి ఈరోజు 'ఎక్సర్‌సైజ్‌ జాపడ్' పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి.

రష్యాలోని నిజ్నీ నగరంలో ఉన్న ములినో ట్రైనింగ్‌ గ్రౌండ్‌లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కసరత్తు కొనసాగుతుంది. ఇందుకోసం 65 మంది సభ్యులతో కూడిన భారత సైనిక బృందం ఇప్పటికే రష్యా చేరుకుంది. ఉగ్రవాద నిరోధక చర్యలు, సంప్రదాయ యుద్ధ రీతుల్లో ఆధునిక వ్యూహాలను పరస్పరం పంచుకోవడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశమని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కసరత్తు వల్ల ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడటంతో పాటు, పరస్పర విశ్వాసం, సహకారం మెరుగుపడతాయని పేర్కొంది.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ కారణంగానే భారత్‌పై ఆయన 50 శాతం సుంకాలను విధించారు. ఇటీవల జరిగిన ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం ట్రంప్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలో భారత్‌పై 100 శాతం సుంకాలు విధించాలని ఐరోపా దేశాలపై కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

అయితే, ఈ అంతర్జాతీయ ఒత్తిళ్లను పట్టించుకోని భారత్, తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. రష్యాతో మైత్రిని కొనసాగించాలనే తన నిబద్ధతను చాటుతూ తాజా సైనిక విన్యాసాలను చేపట్టినట్లు స్పష్టమవుతోంది. 


More Telugu News