సంజూ శాంసన్ వివాదం ముగియకముందే... రాయల్స్‌కు మరో భారీ షాక్!

  • రాజస్థాన్ రాయల్స్ సీఈవో పదవి నుంచి తప్పుకున్న జేక్ లష్ మెక్‌క్రమ్
  • కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును వీడతారనే ఊహాగానాల మధ్య తాజా పరిణామం
  • ఇప్పటికే మార్కెటింగ్ హెడ్ కూడా వైదొలగిన వైనం
  • గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో మొదలైన సంక్షోభం
  • ఫ్రాంచైజీ పగ్గాలు లండన్‌కు తరలిస్తున్న ఓనర్ మనోజ్ బదాలే
  • సౌతాఫ్రికా లీగ్ వేలంలో బాధ్యతలు తీసుకున్న కోచ్ సంగక్కర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌లో అంతర్గత సంక్షోభం ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును వీడతారనే వార్తలు చల్లారకముందే, ఇప్పుడు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జేక్ లష్ మెక్‌క్రమ్ తన పదవికి రాజీనామా చేయడం క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. దీంతో ఫ్రాంచైజీలో అసలేం జరుగుతోందన్న దానిపై సర్వత్ర చర్చ మొదలైంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మెక్‌క్రమ్ తన రాజీనామా విషయాన్ని ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, సహోద్యోగులకు తెలియజేశారు. అక్టోబర్ నాటికి ఆయన తన బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంది. గతంలో జూనియర్ స్థాయిలో రాయల్స్‌లో చేరిన మెక్‌క్రమ్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేసి 2021లో కేవలం 28 ఏళ్ల వయసులోనే సీఈవోగా పదోన్నతి పొందారు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో పార్ల్ రాయల్స్ టేబుల్ వద్ద ఆయన కనిపించకపోవడంతోనే ఆయన నిష్క్రమణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కోచ్ కుమార్ సంగక్కర ఫ్రాంచైజీ బాధ్యతలను ముందుండి నడిపించారు.

ఈ పరిణామాలన్నీ గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్స్ పేలవ ప్రదర్శన తర్వాతే మొదలయ్యాయి. 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలో గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలవడంతో జులైలో జట్టు ప్రదర్శనపై సమీక్ష జరిగింది. ఆ తర్వాతే ఈ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత సీజన్ ముగిసిన వెంటనే మార్కెటింగ్ హెడ్ ద్విజేంద్ర పరాశర్ కూడా ఫ్రాంచైజీని వీడారు.

2026 ఐపీఎల్ వేలానికి ముందే తనను జట్టు నుంచి విడుదల చేయాలని లేదా ట్రేడ్ చేయాలని ఇటీవల సంజూ శాంసన్ యాజమాన్యాన్ని కోరినట్టు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ కోసం ఆసక్తి చూపినప్పటికీ, ఆ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు వరుసగా కీలక వ్యక్తులు వైదొలగడంతో, జట్టు యజమాని మనోజ్ బదాలే నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆయన ఫ్రాంచైజీ నాయకత్వ బాధ్యతలన్నింటినీ భారత్ నుంచి లండన్‌కు తరలిస్తున్నారని సమాచారం.


More Telugu News