నేపాల్ లో సంక్షోభం.. లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు

  • హింసాత్మకంగా మారిన నేపాల్
  • నేపాల్‌లో లో చిక్కుకున్న పలువురు ఏపీ ప్రజలు
  • అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
పొరుగు దేశమైన నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదరడంతో, అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఈ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి రంగంలోకి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు.

నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏపీకి చెందిన వారు అక్కడ అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలియడంతో, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావడమే ప్రథమ కర్తవ్యంగా ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, తక్షణమే ఒక ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయించారు.

నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలను వెంటనే సేకరించి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారిని వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు వీలుగా ఒక ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారులతో మరికాసేపట్లో లోకేశ్ సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు.

గత రెండు రోజులుగా నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అవినీతి, ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో ప్రధాని, మంత్రులు రాజీనామా చేశారు. దీంతో దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News