భారత్-పాక్ మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధం.. కెప్టెన్ల వ్యాఖ్యలు.. కౌంటర్లు!

  • క్రికెట్‌లో దూకుడు చాలా అవసరమన్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
  • ప్రతీ ఆటగాడి శైలి వేరంటూ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కౌంటర్
  • ఈ నెల‌ 14న భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న కీలక పోరు
  • పీసీబీ చీఫ్‌తో సూర్య షేక్ హ్యాండ్‌పై భిన్నాభిప్రాయాలు
  • ఈ రోజు యూఏఈతో తన తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ఆసియా కప్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైన వేళ, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలోనే కాదు, బయట కూడా వాతావరణం వేడెక్కింది. మంగళవారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశంలో భారత సారథి సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మధ్య ఆసక్తికర మాటల యుద్ధం నడిచింది. క్రికెట్‌లో దూకుడు చాలా ముఖ్యమని సూర్యకుమార్ వ్యాఖ్యానించగా, ప్రతి ఆటగాడికి సొంత శైలి ఉంటుందని సల్మాన్ బదులిచ్చాడు.

సెప్టెంబర్ 14న జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ మాట్లాడుతూ, "మైదానంలో దూకుడు ఎప్పుడూ ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం దూకుడు లేకుండా ఈ క్రీడ ఆడలేం. బరిలోకి దిగేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని తెలిపాడు.

అయితే, సూర్య వ్యాఖ్యలపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తనదైన శైలిలో స్పందించాడు. "ఏ ఆటగాడికి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఉంటారు. ఎవరైనా మైదానంలో దూకుడుగా ఉండాలనుకుంటే, దానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది" అని అన్నాడు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కూడా ఇరు కెప్టెన్లు వార్తల్లో నిలిచారు. వేదికపై ఇతర కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుండగా సల్మాన్ వెళ్లిపోవడంతో ఇద్దరూ ఒకరినొకరు పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వేదిక కింద కరచాలనం చేసుకున్నట్లు స్పష్టమైంది. మరోవైపు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ అయిన మోహ్సిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేశారు.

ఇక‌, టోర్నమెంట్‌లో భాగంగా ఈ రోజు దుబాయ్‌లో యూఏఈతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ శుక్రవారం అదే వేదికపై ఒమన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో ఆడుతుంది. గ్రూప్ దశ తర్వాత ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి. టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.

ఆసియా కప్ కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.


More Telugu News