ఏపీలో అందరికీ ఆరోగ్య బీమా అమలుకు వేగంగా అడుగులు

  • ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియకు ఆమోదం
  • టెండర్లు పిలిచేందుకు ఏపీఎంఎంఎస్‌ఐడీసీకి అధికారాలు
  • రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి బీపీఎల్ కేటగిరీ
  • బీపీఎల్ కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా
  • ఏపీఎల్ కుటుంబాలకు రూ.2.50 లక్షల వరకు ఉచిత వైద్యం
ఏపీలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సార్వత్రిక ఆరోగ్య బీమా (యూనివర్సల్ హెల్త్ పాలసీ) అమలు ప్రక్రియను వేగవంతం చేస్తూ, ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసేందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్‌ఎఫ్‌పీ (ప్రతిపాదనల అభ్యర్థన), డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ (డీసీఏ)లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు (ఏపీఎంఎంఎస్‌ఐడీసీ) పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిన ఈ పథకం, తాజా నిర్ణయంతో అమలుకు మరింత చేరువైంది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, పీఏంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలను దారిద్ర్యరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారిగా పరిగణిస్తారు. వీరికి రూ.2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్యం అందుతుంది. ఒకవేళ వైద్య ఖర్చులు ఈ పరిమితి దాటితే, రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది.

దారిద్ర్యరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న కుటుంబాలకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించింది. వీరికి రూ.2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందే సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మార్గం సుగమమైంది.


More Telugu News