హీత్రూలో బ్రిటిష్ వాళ్లు కనిపించట్లేదు.. అంతా ఇండియన్సే.. అమెరికా ప్రయాణికుడి వీడియో వైరల్

  • లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అంతా భారతీయ ఉద్యోగులే ఉన్నారన్న అమెరికన్
  • ఒక్క బ్రిటిష్ వ్యక్తి కూడా పనిలో కనిపించలేదని వీడియోలో ఆశ్చర్యం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రయాణికుడి వ్యాఖ్యలు
  • వలసలు, ఉద్యోగాలపై మొదలైన తీవ్రమైన ఆన్‌లైన్ చర్చ
  • భారతీయుల వల్లే యూకే వ్యవస్థలు నడుస్తున్నాయంటూ నెటిజన్ల ఘాటు స్పందన
  • తన వ్యాఖ్యలు జాత్యహంకారం కాదని ప్రయాణికుడి వివరణ
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఎక్కడ చూసినా భారతీయ ఉద్యోగులే కనిపిస్తున్నారంటూ ఓ అమెరికన్ ప్రయాణికుడు చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో పెను దుమారానికి దారితీశాయి. భద్రతా సిబ్బంది నుంచి దుకాణాల్లో పనిచేసే వారి వరకు ప్రతీ ఒక్కరూ భారతీయులేనని, ఒక్క బ్రిటిష్ వ్యక్తి కూడా తనకు కనిపించలేదని అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వలసలు, ఉద్యోగాలపై తీవ్రమైన చర్చ మొదలైంది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ అమెరికన్ పౌరుడు తన ప్రయాణంలో భాగంగా హీత్రూ విమానాశ్రయంలో ఆగాడు. ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనిస్తూ అతడు ఓ వీడియో తీశాడు. "నేను ఇప్పుడే లండన్‌లో దిగాను. విమానాశ్రయంలో రెస్టారెంట్లు, ఇతర దుకాణాలు ఉన్న చోట తిరుగుతున్నాను. ఇక్కడ ఒక్క బ్రిటిష్ వ్యక్తి కూడా పని చేస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రతీ ఒక్కరూ భారతీయులే" అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అక్కడి సిబ్బంది మర్యాదగా, సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. ఈ పరిస్థితి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపాడు.

అంతేకాకుండా తన వ్యాఖ్యలను జాత్యహంకారంగా చూడవద్దని అతడు కోరాడు. "నేను కూడా ఒక వలసదారుడినే. నేను అమెరికాలో అడుగుపెడితే నాకు అమెరికన్లు కనిపించాలి కానీ, ప్రతిచోటా వేరే దేశం వాళ్లు కాదు కదా? పశ్చిమ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?" అని ప్రశ్నించాడు.

ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో వైరల్ అవ్వగా, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అతడి వాదనను సమర్థించగా, చాలామంది తీవ్రంగా విమర్శించారు. "పని చేయాలంటే కృషి, క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. మీ సామ్రాజ్యం పతనమయ్యాక మీ దేశం ఆ లక్షణాలను కోల్పోయింది. అందుకే మీకు బ్రిటిష్ వాళ్లు కనిపించరు. భారతీయులు ఇక్కడికి వచ్చి ఆసుపత్రులు, ఐటీ కంపెనీలు, రవాణా వ్యవస్థలను బాగుచేశారు" అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

"ఇంతగా బాధపడితే ఇక్కడికి రావడం మానేయండి. వలసదారుల వల్లే యూకే అభివృద్ధి చెందుతోంది" అని మరొకరు కామెంట్ చేశారు. "వాళ్లంతా భారతీయులేనని ఎలా నిర్ధారించారు? పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్లు కూడా కావచ్చు కదా?" అని ఇంకొకరు ప్రశ్నించారు.

కాగా, లండన్ హీత్రూ విమానాశ్రయంలో 76,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో 17 శాతం మంది విదేశాల్లో జన్మించిన వారే. చారిత్రక వలసలు, నైపుణ్యం కలిగిన కార్మిక కార్యక్రమాల కారణంగా వీరిలో భారతీయుల వాటా అధికంగా ఉంది.


More Telugu News