ఎల్ఆర్ఎస్ కోసం రూ. 10 లక్షల లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా అధికారి

  • నార్సింగి మునిసిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక దాడులు
  • లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారిణి
  • ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ కోసం 10 లక్షలు డిమాండ్
  • తొలి విడతగా 4 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత
  • అధికారిణి మణిహారికను అదుపులోకి తీసుకున్న అధికారులు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఫైలును క్లియర్ చేయడానికి ఒక వ్యక్తి నుంచి లక్షల్లో లంచం డిమాండ్ చేసిన మహిళా అధికారిణి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నార్సింగి మునిసిపల్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్‌కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి కోసం నార్సింగి మునిసిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫైల్‌ను పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక, దానిని క్లియర్ చేయాలంటే రూ.10 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వినోద్, నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, పక్కా ప్రణాళికతో వల పన్నారు. వినోద్ రూ.4 లక్షల నగదును మణిహారికకు ఆమె కార్యాలయంలోనే అందజేస్తున్న సమయంలో అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, మణిహారికను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఎసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.


More Telugu News