రాష్ట్రంలో యూరియా కొరత లేదు... వైసీపీ విష ప్రచారం నమ్మొద్దు: మంత్రి కొలుసు పార్థసారథి

  • యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్న పార్థసారథి
  • రైతుల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నమని ఆరోపణ
  • తాము 7 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి
  • వ్యవసాయం, సాగునీటిపై చర్చకు రావాలని వైసీపీకి సవాల్
రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, కేవలం రైతులను భయాందోళనలకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

యూరియా కొరత లేదు.. లెక్కలు ఇవిగో!

యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి, లేని కొరతను సృష్టిస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకు తగ్గట్టుగానే ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. "జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారు. కానీ మేము ఈ ఖరీఫ్ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చాం. 

ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈ నెలలో 94,482 టన్నులు సరఫరా చేశాం. మరో 40 వేల మెట్రిక్ టన్నులు ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరనుంది. వాస్తవాలు ఇలా ఉంటే, కొరత ఉందంటూ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం" అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు.

వ్యవసాయాన్ని నాశనం చేసింది మీరు కాదా?

గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని పార్థసారథి నిప్పులు చెరిగారు. "రైతు బాంధవులం అని చెప్పుకునే మీరు, ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించలేదు. మీరు ఎగ్గొట్టిన రూ.1,624 కోట్ల ధాన్యం బకాయిలను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చెల్లించింది. మీరు 42 లక్షల టన్నుల ధాన్యం కొంటే, మేము 68 లక్షల టన్నులు కొని, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. 

మామిడి, పొగాకు, కోకో, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైతే, తమ ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతులను ఆదుకుందని గుర్తుచేశారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్, ఆ ప్రాంత రైతుల జీవనాధారమైన డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని రద్దు చేసి వారిని నిండా ముంచారని విమర్శించారు.

సాగునీటిపై చర్చకు సిద్ధమా?

సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి ఆరోపించారు. "పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని స్థితికి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మేము గతంలో నీటిపారుదల రంగానికి రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తే, మీరు కేవలం రూ.30 వేల కోట్లతో సరిపెట్టారు. కనీసం కాలువల మరమ్మతులు కూడా చేయలేదు. ఇప్పుడు మేం 2024-29 మధ్య సాగునీటి రంగానికి లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని తెలిపారు. 

దమ్ముంటే వ్యవసాయం, సాగునీటి రంగాలపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపిందని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, మంత్రులందరికీ క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారని ఆయన తెలిపారు.


More Telugu News