ఆసియా కప్‌లో సూర్య సేన అదరగొడుతుంది... మాజీల ఫుల్ కాన్ఫిడెన్స్

  • యూఏఈ వేదికగా రేపటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ ప్రారంభం
  • సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న భారత జట్టు
  • టీమిండియాపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసలు
  • ఈ నెల‌ 10న యూఏఈతో భారత్ తొలి మ్యాచ్.. 14న దాయాదితో పోరు
యూఏఈ వేదికగా రేప‌టి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతంగా రాణిస్తుందని క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు. అనుభవం, యువత కలయికతో పటిష్ఠంగా ఉన్న ఈ జట్టు క‌చ్చితంగా సత్తా చాటుతుందని వారు అభిప్రాయపడ్డారు.

భారత జట్టు కూర్పుపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ యాదవ్ డైనమిక్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్‌లో అడుగుపెడుతోంది. ఈ జట్టులో పట్టుదల, అనుభవం రెండూ ఉన్నాయి. సూర్య తన వినూత్న బ్యాటింగ్, కెప్టెన్సీతో జట్టులోని ఇతర సభ్యులకు స్ఫూర్తినిస్తాడు. ఈ జట్టు భారత క్రికెట్ భవిష్యత్తుకు ప్రతీక. ఆసియా కప్‌లో మన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, టీ20 క్రికెట్‌లో భారత నూతన శకానికి పునాది వేయడానికి ఇదొక మంచి వేదిక" అని అన్నారు.

ఇదే విషయంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. "సూర్య ముందుండి నడిపిస్తుండగా, యువ నాయకత్వ పటిమకు ప్రతీక వంటి శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా భారత జట్టు విజయపథంలో పయనిస్తుంది. ఈ జట్టులో అనుభవం, యువ ప్రతిభకు సరైన మిశ్రమం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు అంతర్జాతీయ అనుభవాన్ని తీసుకొస్తుంటే, తిలక్ వర్మ, హర్షిత్ రాణా వంటి యువకులు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తారు. సూర్య ప్రశాంతమైన, దూకుడైన కెప్టెన్సీలో ఈ జట్టు అద్భుతాలు చేస్తుందని నేను నమ్ముతున్నాను" అని శాస్త్రి తెలిపారు. 

మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ 17వ ఎడిషన్ ఆసియా కప్‌లో భారత్ గ్రూప్ 'ఏ'లో ఉంది. సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో తలపడనుంది. లీగ్ దశ తర్వాత సూపర్ ఫోర్, అనంతరం సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన తెలుగు కామెంటరీ ప్యానెల్‌లో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, రవితేజ, జ్ఞానేశ్వర రావు వంటి మాజీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ 2026 టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా జట్లకు ఉపయోగపడనుంది.


More Telugu News