'తెలుసు కదా' సినిమాపై రాశి ఖన్నా భావోద్వేగ పోస్ట్

  • యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా కొత్త చిత్రం ‘తెలుసు కదా’ 
  • ఈ సినిమా జర్నీ తనకు ప్రత్యేకమన్న రాశి ఖన్నా
  • అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు.

"కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని కథలు గుర్తుండిపోతాయి. 'తెలుసు కదా' అలాంటి కథే. ఈ సినిమా ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకం. ఈ జర్నీలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని రాశి ఖన్నా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతుండటం విశేషం. సిద్ధు సరసన రాశి ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా మరో కథానాయికగా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 


More Telugu News