రెండో దశ ఆంక్షలకు సిద్ధం.. భారత్ వంటి దేశాలే లక్ష్యమన్న ట్రంప్!

  • ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి నేపథ్యంలో తాజా పరిణామం
  • రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యమన్న అమెరికా
  • ఇప్పటికే భారత ఎగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన యూఎస్
  • దేశ ఇంధన భద్రత కోసమే కొనుగోళ్లని స్పష్టం చేస్తున్న భారత్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు పంపారు. రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్యలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయని ఆయన పరోక్షంగా సూచించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ప్రభుత్వ భవనంపై రష్యా భారీ వైమానిక దాడి జరిపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యాపై లేదా రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై కొత్త ఆంక్షలకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని వైట్‌హౌస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్.. "అవును, నేను సిద్ధంగా ఉన్నాను" అని ఒక్క మాటలో సమాధానమిచ్చారు. అయితే, ఆ ఆంక్షల స్వరూపంపై ఆయన ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటం, శాంతి ప్రయత్నాలు విఫలం కావడంతో అమెరికా ప్రభుత్వంలో అసహనం పెరుగుతోందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ అంశంపై అమెరికా ఆర్ధిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మరింత స్పష్టతనిచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి ‘సెకండరీ టారిఫ్‌లు’ విధించే అవకాశం ఉందని ఓ టీవీ ఛానెల్‌కు తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడం ద్వారానే అధ్యక్షుడు పుతిన్‌ను చర్చల టేబుల్‌పైకి తీసుకురాగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే గత నెలలో అమెరికా.. భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను విధించింది. దీంతో మొత్తం దిగుమతి సుంకం 50 శాతానికి చేరింది. "రష్యా యుద్ధ యంత్రాంగానికి భారత్ ఇంధనం పోస్తోందని" ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అయితే, అమెరికా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశ ఇంధన భద్రతా అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని, అమెరికా ఆంక్షలు అన్యాయమని న్యూఢిల్లీ వాదిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య ఆన్‌లైన్‌లో జరిగిన సంభాషణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించినప్పటికీ, తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు, ఆదివారం జరిగిన దాడిలో రష్యా 810 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించగా, వాటిలో 747 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడిలో నలుగురు పౌరులు మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించి, యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌పై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరారు.


More Telugu News