గంభీర్‌ మాకు ఏం చెప్పాడంటే...!: శివమ్ దూబే

  • మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025
  • టోర్నీ ముందు కోచ్ గంభీర్ ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిలించారన్న ఆల్‌రౌండర్‌ శివమ్ దూబె
  • ఆసియా కప్‌లో స్పాన్సర్‌ లేని జెర్సీతో బరిలోకి దిగనునన టీమ్‌ఇండియా  
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ - హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో, రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, మూడో మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.

శిక్షణలో తళుక్కుమన్న భారత జట్టు

ఇప్పటికే టీమ్‌ఇండియా ఆటగాళ్లు దుబాయ్ చేరుకుని శిక్షణ ప్రారంభించారు. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకున్న భారత్, ఈసారి ఆసియా కప్‌ను కూడా సొంతం చేసుకోవాలని కసిగా ముందుకెళ్తోంది. శుక్రవారం నుంచే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మైదానాల్లో సాధన చేస్తున్నారు.

కోచ్‌ గంభీర్‌ ప్రోత్సాహం

కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్, టోర్నీ ముందు ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిలించారంటూ ఆల్‌రౌండర్‌ శివమ్ దూబె వెల్లడించాడు. ఈ మాటల వీడియోను బీసీసీఐ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. "మీరు ఎప్పుడైతే టీమిండియా తరపున ఆడతారో... అప్పుడు మీ అందరికీ ఏదైనా కొత్తగా చేసే అద్భుత అవకాశం దక్కినట్లే. అందుకే శిక్షణను చక్కగా వినియోగించుకోవాలి. అలాగే ఉత్తమ క్రికెటర్ గా ఎదిగేందుకు కృషి చేయాలి" అని గంభీర్ మాతో అన్నారు అని శివమ్ దూబె పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గేమింగ్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్‌11తో బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాన్సర్‌ కోసం సెప్టెంబర్ 2న బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కంపెనీలకు సెప్టెంబర్ 16 వరకు అప్లికేషన్ సమర్పించే గడువు ఉంది. తాత్కాలికంగా ఆసియా కప్‌లో స్పాన్సర్‌ లేని జెర్సీతో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది.

ఆసియా కప్ కు భారత జట్టు ఇదే

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌ దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్‌ రాణా, రింకు సింగ్ 


More Telugu News