యువకుడి ప్రాణం తీసిన సెల్ ఫోన్ వివాదం

  • సెల్ ఫోన్ అడిగినందుకు మొదలైన వివాదం
  • వాచ్‌మెన్‌పై చేయి చేసుకున్న యువకుడు
  • ఇద్దరు కుమారులతో కలిసి ఎదురుదాడి చేసిన తండ్రి
  • ఆసుపత్రి సెల్లార్‌లో విచక్షణారహితంగా దాడి
  • తీవ్ర గాయాలతో యువకుడి మృతి
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. సెల్ ఫోన్ ఇవ్వలేదన్న చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఫోన్ అడిగినందుకు మొదలైన గొడవ హత్యకు దారితీయగా, ఈ ఘటనలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి, అతడి ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం  రోడ్డు నంబర్ 14లో నివసించే శ్రీధర్ (30) ఈవెంట్లలో లేబర్‌గా పనిచేస్తుంటాడు. గురువారం రాత్రి తన స్నేహితుడిని ద్విచక్ర వాహనంపై దించి తిరిగి వస్తుండగా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో రోడ్డు నంబర్ 14లోని ఆశా ఆసుపత్రి వద్ద ఆగి, అక్కడి వాచ్‌మెన్ వెంకటయ్యను ఒక కాల్ చేసుకునేందుకు ఫోన్ అడిగాడు.

అయితే, తన ఫోన్‌లో బ్యాలెన్స్ లేదని వెంకటయ్య సమాధానమిచ్చాడు. ఫోన్ ఇవ్వడం ఇష్టం లేకే అతడు అబద్ధం చెబుతున్నాడని భావించిన శ్రీధర్, వెంకటయ్యతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వెంకటయ్యపై శ్రీధర్ చేయి చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య వెంటనే తన కుమారులు హరికృష్ణ, తరుణ్‌లకు సమాచారం ఇచ్చాడు.

అక్కడికి చేరుకున్న కొడుకులు తండ్రితో కలిసి శ్రీధర్‌ను ఆసుపత్రి సెల్లార్‌లోకి లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీధర్ కష్టంగా ఇంటికి చేరుకుని కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు వెంకటయ్య, హరికృష్ణ, తరుణ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


More Telugu News