సీఎం హెలికాప్టర్ మార్పు.. తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్

  • సీఎం చంద్ర‌బాబు వినియోగించే హెలికాప్టర్‌ను మార్చిన ప్రభుత్వం
  • పాత బెల్ చాపర్‌లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలోనూ మొరాయించిన హెలికాప్టర్
  • భద్రతా సిబ్బంది సూచనలతో కొత్త ఎయిర్‌బస్ చాపర్ అద్దెకు
  • హెలికాప్టర్ కొన్నారంటూ తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్
సీఎం చంద్రబాబుతో పాటు ఇతర వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటివరకు వినియోగిస్తున్న బెల్ కంపెనీ చాపర్‌ను పక్కనపెట్టి, దాని స్థానంలో అధునాతన ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్‌ను అద్దె ప్రాతిపదికన వినియోగంలోకి తెచ్చింది.

గత కొంతకాలంగా సీఎం పర్యటనల కోసం వాడుతున్న బెల్ హెలికాప్టర్‌లో పలుమార్లు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. టేకాఫ్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం, సాంకేతిక మొరాయింపు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇదే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాల్సిన ఆయన, చాపర్ మొరాయించడంతో తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ హెలికాప్టర్ వినియోగం సురక్షితం కాదని, దాని స్థానంలో మెరుగైన దానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వారి సూచన మేరకు ప్రభుత్వం కొత్త ఎయిర్‌బస్ హెచ్ 160 చాపర్‌ను అద్దెకు తీసుకుంది. ఈ కొత్త హెలికాప్టర్ గతంలో వాడిన దానికంటే సాంకేతికంగా చాలా అధునాతనమైనది. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా నేరుగా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. భద్రతా ప్రమాణాల పరంగా కూడా ఇది ఎంతో మెరుగైనదని నిపుణులు చెబుతున్నారు.

తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం కన్నెర్ర
అద్దె ప్రాతిపదికన హెలికాప్టర్‌ను వినియోగిస్తుండగా, ప్రభుత్వం కొత్త హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


More Telugu News