కవిత, హరీశ్ మధ్య పంచాయితీ 1999 నుంచే ఉంది: కేసీఆర్ సన్నిహితుడు గాదె ఇన్నయ్య

  • రచ్చకెక్కిన కేసీఆర్ కుటుంబంలోని విభేదాలు
  • కవితకు హరీశ్, కేటీఆర్‌తోనే కాకుండా ఇతరులతో కూడా సమస్యలు ఉన్నాయన్న ఇన్నయ్య
  • కేసీఆర్ భార్య శోభ జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో రాజుకున్న రాజకీయ చిచ్చుపై కొత్త చర్చ మొదలైంది. కవిత, హరీశ్ రావు మధ్య విభేదాలు ఈనాటివి కావని, వాటి మూలాలు దశాబ్దాల క్రితమే ఉన్నాయంటూ కేసీఆర్ సన్నిహితుడు గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదానికి పరిష్కారం కేసీఆర్ భార్య శోభ జోక్యంతోనే సాధ్యమని ఆయన చెప్పడం గమనార్హం.

ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత, తన తండ్రి కేసీఆర్‌కు చెడ్డపేరు రావడానికి హరీశ్ రావే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ దుమారానికి తెరలేపింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు గందరగోళంలో పడగా, కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గాదె ఇన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు.

"కవిత, హరీశ్ రావు మధ్య పంచాయితీ ఇప్పటిది కాదు. 1999, 2000 సంవత్సరాల్లో ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ ఆ కుటుంబాన్ని కించపరిచేలా బయట మాట్లాడటం సరికాదు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే శోభ వదిన (కేసీఆర్ భార్య) నోరు తెరవాలి. ఆమె జోక్యం చేసుకుంటేనే అంతా సర్దుకుంటుంది. మేమంతా ఆ కుటుంబంలో ఉన్నవాళ్లం, ఆవిడ పెడితే తిన్నవాళ్లం" అని ఇన్నయ్య వ్యాఖ్యానించారు.

కవితకు కేవలం హరీశ్ రావుతోనే కాకుండా, కేటీఆర్‌తో, ఇతరులతో కూడా వేర్వేరు సమస్యలు ఉన్నాయని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇంతకీ 1999లో వారి మధ్య అసలేం జరిగిందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. 


More Telugu News