KA Paul: చంద్రబాబుకు వారం రోజుల టైమ్ ఇస్తున్నా... నేను తలుచుకుంటే అందరూ పైకి పోతారు: కేఏ పాల్

KA Paul Warns Chandra Babu and Pawan Kalyan
  • నా జోలికొస్తే వారం తర్వాత ఏంటో చూపిస్తానంటూ చంద్రబాబుకు పాల్ హెచ్చరిక
  • నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతారంటూ సంచలన వ్యాఖ్యలు
  • పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్ అని ఆరోపణ
  • లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్
  • సుగాలి ప్రీతి కేసును సీరియస్‌గా తీసుకుంటానని ప్రకటన
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన జోలికి వస్తే సహించేది లేదని, వారం రోజుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... "ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి పూర్తిగా సరెండర్ అయ్యారు. ఆయన 120 ఏళ్లు బతుకుతానంటున్నారు. కానీ నేను తలుచుకుంటే 125 రోజుల్లోనే పైకి పోతారు. నా ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నాను" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఛారిటీ సంస్థల జోలికి రావొద్దని, చంద్రబాబుకు వారం రోజుల సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత అందరి లెక్కలు తీరుస్తానని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులకు అమ్ముడుపోయారని కేఏ పాల్ ఆరోపించారు. మరోవైపు నారా లోకేశ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. "ఒకవైపు జగన్, మరోవైపు లోకేశ్.. వాళ్ల తండ్రులను చూసుకుని రెచ్చిపోతున్నారు. నేను రంగంలోకి దిగితే అందరి సంగతి తేలుస్తా" అని మండిపడ్డారు.

ఇదే సమావేశంలో సుగాలి ప్రీతి కేసును తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని పాల్ ప్రకటించారు. గతంలో నిమిషా కేసును ఎలాగైతే కొలిక్కి తెచ్చానో, అదే విధంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. "పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగడం మీరు చూశారా? లేక మీరేమైనా ఆయనకు మద్యం పోశారా?" అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 
KA Paul
Chandra Babu
Pawan Kalyan
Praja Shanti Party
AP CM
Nara Lokesh
Sugali Preethi case
Pastor Praveen Pagadala
Andhra Pradesh Politics
Package Star

More Telugu News