Bandaru Shravani: ఎమ్మెల్యే శ్రావణి కులం తక్కువనేనా ఈ విమర్శలు?.. సొంత పార్టీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

JC Prabhakar Reddy Fires on TDP Leaders Over Criticism on MLA Shravani
  • సింగనమల ఎమ్మెల్యే శ్రావణికి జేసీ ప్రభాకర్ రెడ్డి అండ
  • కులం తక్కువనే ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్న
  • ప్రతిపక్షంపై మాట్లాడకుండా సొంత నేతలపై విమర్శలా? అని నిలదీత
  • సమస్యలుంటే పార్టీ పెద్దలతో మాట్లాడుకోవాలని సూచన
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న వర్గపోరుపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిని లక్ష్యంగా చేసుకుని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెనుకబడిన కులానికి చెందిన మహిళ కావడం వల్లే ఆమెపై ఈ విధంగా దాడులు చేస్తున్నారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, "బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే, ఆమెకు అన్నీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫొటో పక్కన పెట్టి డబ్బులు లెక్కిస్తున్నట్లు వీడియోలు సృష్టించి వైరల్ చేయడం దారుణం" అని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ప్రతాపం చూపిస్తున్న నేతలు... ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడటానికి ఎందుకు ధైర్యం చేయడం లేదని నిలదీశారు.

"బుక్కరాయసముద్రం, పుట్లూరు లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు మీటింగ్‌లు పెట్టి మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఒక మహిళా ఎమ్మెల్యేపై మీ ప్రతాపం చూపించడమేనా రాజకీయం?" అని ఆయన విరుచుకుపడ్డారు. పార్టీలో గ్రూపులు సహజమేనని, తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలోనే దాదాపు 150 గ్రూపులు ఉన్నాయని జేసీ వ్యాఖ్యానించారు.

ఏవైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని సూచించారు. "మీకు ఏమైనా ఇబ్బందులుంటే సింగనమలలో పార్టీ సీనియర్ నాయకులు నర్సా నాయుడు, కేశవరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప, ఇలా బహిరంగంగా రచ్చ చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుంది" అని ఆయన హితవు పలికారు.
Bandaru Shravani
JC Prabhakar Reddy
Singanamala
TDP
Andhra Pradesh Politics
Anantapur
Telugu Desam Party
MLA
Caste Discrimination

More Telugu News