రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత.. ఎందుకంటే?

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు
  • రూ.3.66 కోట్ల విలువైన కారుపై జీఎస్టీ, సెస్సుల మినహాయింపు
  • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం
  • ఇది విలాసవంతమైన వాహనం కాదు, దేశ భద్రతకు సంబంధించిన ఆస్తి అని స్పష్టీకరణ
  • ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్ స్థానంలోకి రానున్న కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం
  • అత్యంత అరుదుగా ఇచ్చే పన్ను మినహాయింపుల్లో ఇదొకటి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక ప్రయాణాల నిమిత్తం కొనుగోలు చేయనున్న అత్యంత భద్రత కలిగిన నూతన బీఎండబ్ల్యూ కారుకు పన్నుల నుంచి పూర్తి మినహాయింపు లభించింది. రూ.3.66 కోట్ల విలువైన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై విధించాల్సిన ఐజీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్సును రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి వాహనం ఒక విలాసవంతమైన వస్తువు కాదని, దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ఆస్తి అనే ప్రత్యేక కారణంతో ఈ వెసులుబాటు కల్పించారు.

సాధారణంగా ఇలాంటి విదేశీ కార్ల దిగుమతిపై 28 శాతం ఐజీఎస్టీతో పాటు కస్టమ్స్ సుంకం, అదనపు సెస్సులు భారీగా ఉంటాయి. అయితే, రాష్ట్రపతి భద్రత దృష్ట్యా ఈ వాహనం అత్యంత ఆవశ్యకమని భావించిన జీఎస్టీ కౌన్సిల్ ఫిట్‌మెంట్ కమిటీ, పన్ను మినహాయింపు కోసం ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో రాష్ట్రపతి సచివాలయం ఎటువంటి పన్ను భారం లేకుండా ఈ వాహనాన్ని సమకూర్చుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రపతి కాన్వాయ్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్ వాహనాన్ని వినియోగిస్తున్నారు. దీని స్థానంలో ఇప్పుడు అత్యాధునిక బీఎండబ్ల్యూ సెడాన్ చేరనుంది. ప్రస్తుతం వాడుతున్న కారులో బుల్లెట్ల నుంచి, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు, మల్టీ లేయర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, దాడులు జరిగినప్పుడు దానంతట అదే మూసుకుపోయే ఫ్యూయల్ ట్యాంక్, ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ వంటివి ఉన్నాయి. కొత్తగా రాబోయే బీఎండబ్ల్యూ కారులో ఇంతకంటే అధునాతన భద్రతా ప్రమాణాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పన్ను మినహాయింపులు చాలా అరుదని, కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రత్యేక కేసుల్లో మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుందని అధికారులు తెలిపారు.


More Telugu News