Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక కానుకలు పంపిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Sends Gifts to Teachers in Pithapuram Constituency
  • పిఠాపురంలో ఒకరోజు ముందే మొదలైన ఉపాధ్యాయ దినోత్సవ సందడి
  • నియోజకవర్గంలోని 2 వేల మంది గురువులకు పవన్ కల్యాణ్ కానుకలు
  • మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు క్లాత్‌ల అందజేత
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. గురుపూజ్యోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రత్యేక బహుమతులు పంపి వారిని గౌరవించారు.

నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఈ కానుకలు అందజేశారు. మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు క్లాత్‌లను బహుమతులుగా అందించారు.

ఈ ఉదయాన్నే పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకున్నాయి. అక్కడ ఈ బహుమతులను ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు పంపిణీ చేశాయి. తమ శాసనసభ్యుడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమను గుర్తుంచుకుని కానుకలు పంపడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Pithapuram
Teachers Day
Teachers
AP Deputy CM
Andhra Pradesh
Gollaprolu
Kothapalli
Education Department

More Telugu News