కేసీఆర్ పక్కన కట్టప్పలాంటి వాడు.. టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు వస్తుంటే వద్దన్నాడు: హరీశ్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు

  • హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు అన్న కవిత
  • తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని మండిపాటు
  • పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని హరీశ్ చూశాడన్న కవిత
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు, సంతోష్ రావు మేకవన్నె పులులు అని చెప్పినా కేసీఆర్ వినిపించుకోవడం లేదని కవిత అన్నారు. కేసీఆర్ పక్కన కట్టప్పలాంటి వాడు హరీశ్ రావు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని... అందుకే తనను పార్టీ నుంచి బయటపడేశారని మండిపడ్డారు. రేపు కేసీఆర్ కు, కేటీఆర్ కు కూడా ఇదే జరుగుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. 

హరీశ్ రావు ఒకానొక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశాడని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ ఫండింగ్ వ్యవహారం అంతా తనకు స్పష్టంగా తెలుసని చెప్పారు. తెలంగాణ సమాజం అత్యున్నతంగా ఉండాలని 'బంగారు తెలంగాణ' నినాదాన్ని కేసీఆర్ తెచ్చారని... హరీశ్, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అది బంగారు తెలంగాణ కాదని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తుంటే కేసీఆర్ ను హరీశ్ ఆపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆనాడు ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీశ్ వద్దన్నారని తెలిపారు.


More Telugu News