రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధర

  • వారం రోజుల్లో రూ.5,900 పెరుగుదల
  • ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,06,070లకు చేరిన వైనం
  • జనవరి నుంచి ఇప్పటి వరకు 34.35 శాతం పెరుగుదల
పసిడికి మరోసారి రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడంతో మదుపర్లు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయంగానూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,06,070కి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ ధరగా ఆల్‌టైం రికార్డు సృష్టించింది. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా పెరుగుతూనే ఉండటం గమనార్హం.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వివరాల ప్రకారం.. సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,05,670 ముగియగా, మంగళవారం రూ.400లు పెరిగి గరిష్ఠాన్ని తాకింది. గత వారం రోజుల్లో బంగారం రూ.5,900 మేర పెరిగింది. ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.78,950 కాగా, ఇప్పటి వరకు 34.35శాతం పెరుగుదల నమోదు చేసింది.

వెండి ధరలూ పైపైకి

బంగారం మాత్రమే కాదు, వెండి కూడా పరుగులు పెడుతోంది. నిన్న కిలో వెండి ధర రూ.1,26,100కి చేరింది. ఇది వెండికి సంబంధించి అరుదైన స్థాయిగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎందుకింత పెరుగుదల..?

అమెరికా టారిఫ్‌లు, రూపాయి విలువ తగ్గుదల, గ్లోబల్ మార్కెట్‌లో బంగారానికి పెరుగుతున్న డిమాండ్, అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య ‘సురక్షిత పెట్టుబడి’గా బంగారం వైపు మదుపర్ల మొగ్గు చూపడమేనని తెలుస్తోంది. 


More Telugu News