Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం... 1,411కు పెరిగిన మృతుల సంఖ్య

Afghanistan Earthquake Death Toll Rises to 1411
  • 3,100 మందికి పైగా గాయాలు, 5400 ఇళ్లు నేలమట్టం
  • శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది ప్రజలు
  • సహాయక చర్యలకు ఆటంకంగా క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి సృష్టించిన ప్రళయానికి భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 1న సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 1,411 మంది మరణించారని, మరో 3,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తు ఆఫ్ఘనిస్థాన్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి 5,400 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ముజాహిద్ తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ముఖ్యంగా మట్టి, కలపతో నిర్మించిన ఇళ్లు ఎక్కువగా ఉండటంతో అవి భూ ప్రకంపనలకు తట్టుకోలేక పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నేలమట్టం కావడంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చాలామంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం పెను విషాదానికి కారణమైంది.

ప్రస్తుతం మారుమూల పర్వత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, సరైన దారులు లేకపోవడం వల్ల సహాయక బృందాలు ఘటనా స్థలాలకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి అధికారి ఇంద్రికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని ఇంద్రికా విజ్ఞప్తి చేశారు. మరోవైపు, 2021లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మూడో అతిపెద్ద భూకంపం ఇది. అంతర్జాతీయ సహాయం కోసం తాలిబన్లు పిలుపునిచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇతర సంక్షోభాలు, మహిళల హక్కులపై వారు విధిస్తున్న ఆంక్షల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌కు అందే విదేశీ సాయం గణనీయంగా తగ్గిపోయింది.
Afghanistan Earthquake
Afghanistan
Earthquake
Taliban
Zabihullah Mujahid
Natural Disaster
Humanitarian Aid
United Nations
Indrika Ratwatte

More Telugu News