Chandrababu Naidu: ఎటుచూసినా అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Reviews Amaravati Development Approves SPV
  • రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు
  • 7 కీలక నిర్ణయాలకు సీఆర్డీఏ ఆమోదం
  • రాజధాని పనుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజధానిలో చేపట్టాల్సిన ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో, పూర్తిచేయడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (స్పెషల్ పర్పస్ వెహికల్ - ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. మొత్తం 7 కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, అంగీకారం తెలిపారు. రాజధాని అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కార్యాచరణలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఎటుచూసినా అమరావతి నగరం ఆకర్షణీయంగా కనిపించాలని దిశానిర్దేశం చేశారు.

ఎస్పీవీ పరిధిలోకి కీలక ప్రాజెక్టులు

రాజధాని అమరావతికి తలమానికంగా నిలవనున్న అనేక కీలక ప్రాజెక్టుల బాధ్యతను ఇకపై ఈ ఎస్పీవీ పర్యవేక్షించనుంది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఐకానిక్ వంతెన, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, కృష్ణా నది రివర్ ఫ్రంట్, రోప్ వే వంటి భారీ నిర్మాణాల ప్రణాళిక, నిధుల సమీకరణ, అమలు, నిర్వహణ బాధ్యతలను ఈ ప్రత్యేక సంస్థే చూసుకుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని, అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘బయో డిజైన్ ప్రాజెక్టు’ను కూడా ఎస్పీవీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తరహాలోనే ఒక ‘హెల్త్ సిటీ’ని కూడా అభివృద్ధి చేయనున్నామని, అందులో భాగంగానే ఈ బయో డిజైన్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని ఆయన వెల్లడించారు. ప్రజారోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు అమెరికా, సింగపూర్ సహా ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయని సీఎం తెలిపారు.

మౌలిక వసతుల కల్పనకు గ్రీన్ సిగ్నల్

అమరావతిలో పరిపాలన భవనాల సముదాయం (గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులకు సంబంధించిన టెండర్లకు కూడా సీఆర్డీఏ అథార్టీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొత్తం 53.68 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా, ఏడేళ్ల పాటు ఆ రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చూసుకునేలా నిబంధనలు చేర్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రతి నిర్మాణం ఒక అద్భుతంలా ఉండాలి

రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి నిర్మాణం ప్రజలను ఆకట్టుకునేలా, ఒక అద్భుతంలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి అథారిటీ ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిజైన్ల ఆమోదం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నగరం మొత్తం ఒక ప్రత్యేక ఆకర్షణతో కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మరోవైపు, సీఆర్డీఏ పరిధిలో కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్ లేదా ఆన్-డ్యూటీ పద్ధతిలో నియమించుకునేందుకు సీఎం అనుమతినిచ్చారు.

రాజధానిలో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కొన్ని ప్రముఖ హోటల్ సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు తెలపగా, వాటికి భూములు కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ అవసరాల నిమిత్తం ఏమైనా భూసేకరణ చేయాల్సి వస్తే, రైతులతో స్నేహపూర్వకంగా చర్చించి, వారికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం తేల్చిచెప్పారు. కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన ఐకానిక్ వంతెన డిజైన్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదిలోని లంక భూములను (ద్వీపాలను) అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
CRDA
Capital City
Infrastructure Development
SPV
Green Field Airport
Iconic Bridge
Health City

More Telugu News